Gita Acharan |Telugu

‘‘వాస్తవానికి మన ఇంద్రియాలు చేసే కర్మలన్నీ ప్రాకృతికమైన గుణాల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అజ్ఞాని అహంకారంతో ఆ కర్మలను తనే చేస్తున్నానని అనుకుంటాడు. అంటే ‘ఆ కర్మలకి కర్తను నేనే’ అని భావిస్తాడు. కానీ గుణాలు, కర్మల తత్త్వాన్ని తెలుసుకున్న విజ్ఞుడు ఈ ఇంద్రియరూపాలైన విషయాలన్నీ ఆ గుణాల ఆధారంగానే సాగుతున్నాయని గ్రహిస్తాడు. వాటి మీద ఆసక్తి చూపడు’’ అని ‘భగవద్గీత’లో చెప్పాడు శ్రీకృష్ణుడు.

 

భగవద్గీత ప్రధానంగా బోధించే విషయం ఏమింటంటే... ఏ కర్మలకూ మనం బాధ్యులం కాదు. మనలోనూ, ఇతరులలోనూ ఉన్న గుణాల మధ్య పరస్పర సంబంధం వల్ల కర్మలు జరుగుతాయి. సత్వ, తమో, రజో అనే ఆ మూడు గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. సత్వగుణం జ్ఞానంతో, రజో గుణానికి కర్మతో అనుబంధం ఉంటుంది. తమస్సు అజ్ఞానానికీ, సోమరితనానికీ దారి తీస్తుంది. ఏ గుణం మరో గుణం కన్నా గొప్పదో, తక్కువదో కాదని గమనించాలి. అవి కేవలం గుణాలు.

 

ఉదాహరణకు... ఒక వ్యక్తిలో రజో గుణం ఎక్కువగా ఉన్నట్టయితే... అతను పనుల పట్ల గాఢంగా మొగ్గు చూపిస్తాడు. అంత గాఢమైన కార్యదీక్ష ఉన్నవారు నిద్రపోవాలంటే తమో గుణం అవసరం.

ప్రస్తుత తరుణంలో మనల్ని శాసిస్తున్న గుణం గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు... తమస్సు ప్రభావం వల్ల ఒకరు బద్ధకంగా సోఫాలో కూర్చొని, టీవీ చూడడానికి ఇష్టపడతారు. మరోవైపు వారి జీవిత భాగస్వామి రజోగుణంలో ఉన్నట్టయితే... అతను/ ఆమె సినిమాకో, షాపింగ్‌కో, స్నేహితులను కలుసుకోడానికో బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇలా తమో, రజో గుణాల మధ్య పరస్పర సంపర్కం మీద తదుపరి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. గుణాల పరస్పర సంపర్కంతో నడిచే ఇలాంటి పరిస్థితులు మనం పని చేసే కార్యాలయాల్లోనూ సంభవిస్తాయి.

 

‘‘మనం గుణాతీతులుగా మారడానికి గుణాలను అధిగమించగలగాలి’’ అని శ్రీకృష్ణుడు బోధించాడు. అంటే ప్రస్తుత క్షణంలో మనమీదా, ఇతరుల మీదా ఆధిపత్యం చెలాయిస్తున్న గుణాల గురించి అవగాహన కలిగి, వాటి పరస్పర సంపర్కాలకు మనం కేవలం సాక్షిగా మిగిలిపోవాలి. అప్పుడే గుణాలను అధిగమించే స్థితిని చేరుకోగలం.

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!