Gita Acharan |Telugu

 

‘‘ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందే... అంటే జీవించి ఉన్నప్పుడే కామం, క్రోధం లాంటి ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేసిన సాధకుడే యోగి. అతనే సుఖంగా ఉంటాడు’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అలాంటి స్థితిని సాధించాలంటే సంతోషం, దుఃఖంతో సహా అన్ని భావోద్వేగాల మీద మనకు అదుపు ఉండాలి. కానీ చాలాసార్లు వాటిని వేరే వ్యక్తులు మన భావోద్వేగాలను అదుపు చేస్తూ ఉంటారు. వారి ప్రభావానికి మనం లోనవుతూ ఉంటాం. దీనివల్ల అంతిమంగా మనకు కలిగేది దుఃఖమే. కాబట్టి ‘భావోద్వేగాల కళ్ళాలు మన చేతుల్లో ఉన్నాయా? ఇతరుల చేతుల్లో ఉన్నాయా?’ అనేది ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. అంతా మన అదుపులోనే ఉందని భావిస్తూ ఉంటాం. కానీ తరచుగా అవి ఇతరుల చేతుల్లో ఉంటాయి.

అది స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సహోద్యోగి కావచ్చు... వారి మనస్థితి, భావాలు, మాటలు, పొగడ్తలు, విమర్శలు మనల్ని సంతోషానికి లేదా బాధకు గురి చేస్తాయి. ఆహారం, పానీయాలు, భౌతిక వస్తువులు, అనుకూల , ప్రతికూల పరిస్థితులు, చివరకు మన గతం, భవిష్యత్తు కూడా ఇలాంటి ప్రభావాలకు కారణం అవుతూ ఉంటాయి.

‘‘అంతరాత్మలోనే సుఖించే, ఆత్మజ్ఞాని అయిన సాంఖ్య యోగి... పరబ్రహ్మమైన పరమాత్మతో ఏకీకృతమై, అత్యున్నతమైన నిర్మాణస్థితిని పొందుతాడు. అలాగే నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మమీద లగ్నం చేసే బ్రహ్మవేత్తలు కూడా నిర్వాణాన్ని పొందుతారు’’ అని శ్రీకృష్ణుడు వివరించాడు. ‘‘కామాన్ని, మోహాన్ని జయించి, క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడమే మనకు మనం చేసుకొనే సాయం.

ఇది సాధించిన తరువాతే సర్వప్రాణి హితం... అంటే ఇతరుల పట్ల దయగా వ్యవహరించడం, వారికి సహాయం చేయడం సాధ్యమవుతుంది’’ ఆయన స్పష్టం చేశాడు.

కె.శివప్రసాద్‌

 

https://www.andhrajyothy.com/2025/navya/krishnas-wisdom-on-control-1410053.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!