Gita Acharan |Telugu

 

జీవితంలో మనకు రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఎంతోమంది వ్యక్తులను కలుసుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితులో కొన్ని ఆహ్లాదకరమైనవని, మరికొన్ని బాధాకరమైనని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. వ్యక్తుల విషయంలోనూ అంతే. ‘వీరు మంచివారు, వారు చెడ్డవారు’ అనే నిర్ధారణలు చేసుకుంటాం. ఈ భావాలను విడిచిపెట్టాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.

‘మనకు ఏది మంచిది, ఏది చెడ్డది’ అనే వాస్తవాలను తెలుసుకోవడంలో చేసే పొరపాట్ల కారణంగా మోహానికి గురి అవుతామనీ, దాని నుంచి బయటపడాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు పదేపదే బోధించాడు. మనం ఇంద్రియాల ద్వారా సుఖం పొందగలమనేది అతి పెద్ద భ్రమ. ఇంద్రియ సుఖాలను పట్టించుకోనివారు దివ్యమైన ఆనందాన్ని తమ ఆత్మలోనే పొందుతారని, యోగం ద్వారా పరమాత్మలో లీనమైనవారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ‘‘విషయేంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నమయ్యే భోగాలన్నీ భోగలాలసులకు సుఖాలుగా కనిపిస్తాయి. కానీ అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే. అవి అనిత్యాలు. కాబట్టి అర్జునా! అలాంటి వాటిపట్ల వివేకి అయినవాడు ఆసక్తి చూపించడు’’ అని చెప్పాడు.

‘‘ఇంద్రియాలు తమతమ ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు సుఖదుఃఖాలనే ద్వంద్వాలు కలుగుతాయి. వాటిని మనం భరించాలి. ఎందుకంటే అవి అనిత్యమైనవి’’ అని ‘భగవద్గీత’ ఆరంభంలోనే శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అనిత్యం అంటే... సుఖమైనా, దుఃఖమైనా వాటికి ఒక ప్రారంభం ఉంటుంది, ముగింపు సైతం తప్పనిసరిగా ఉంటుంది. సుఖాలు దక్కనప్పుడు దుఃఖాన్ని, దుఃఖం తొలగిపోయినప్పుడు సుఖాన్ని మనం అనుభూతి చెందుతాం. వీటిని అధిగమించడం కోసం మనం గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటాం, నెమరువేసుకుంటాం. లేదా దుఃఖానికి మరొకరు కారణమని నిందిస్తూ ఉంటాం. సుఖదుఃఖాలను అనుభూతి చెందుతున్నప్పుడే అవి అశాశ్వతమైనవనే అవగాహన కలిగినప్పుడు... ఆ భావనలను అధిగమించగలం. క్రమంగా వాటి పట్ల ఆసక్తి నశిస్తుంది.

కె.శివప్రసాద్‌ 

https://www.andhrajyothy.com/2025/navya/lifes-impermanence-happiness-and-sorrow-1412622.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!