
‘మరింత అభివృద్ధి చెందాలి, రక్షణతో, భద్రతతో ఉండాలి’ అనే కోరికను మనం వదిలేస్తే... మనల్ని, మన కుటుంబాలను, మన సంస్థలను ఎవరు చూసుకుంటారు?... కోరికలను వదులుకోవాలని ఎవరైనా బోధించినప్పుడు మనలో సాధారణంగా కలిగే భయం ఇది. ఇది సహజంగా, తార్కికంగా కనిపిస్తుంది. తన భక్తులు ఇలాంటి భయాన్ని అధిగమించడం కోసం నిశ్చల చిత్తంతో తనను ధ్యానించేవారి యోగక్షేమాలను తనే వహిస్తానని (యోగ క్షేమమ్ వహామ్యహమ్) శ్రీ కృష్ణుడు హామీ ఇచ్చాడు. ఇక్కడ ‘యోగం’ అంటే కలయిక. ఎవరైతే నిశ్చలమైన బుద్ధితో భగవంతుడితో ఐక్యత సాధిస్తారో... వారి ఎదుగుదలకు, సంక్షేమానికి హామీ, అన్నిటికన్నా శక్తివంతుడైన భగవంతుడి కృప లభిస్తుంది.
‘‘గ్రహ దేవతలను పూజించేవారు... వారిని చేరుకుంటారు. పితృదేవతలను ఆరాధించేవారు వారి దగ్గరకు వెళ్తారు, భూతప్రేతాల్ని అర్చించేవారు అలాంటి వాటిలోనే పుడతారు’’ అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అంటే కోరికలు తీర్చుకోవడానికి చాలామంది వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. కానీ కోరికలు వదులుకున్నవారు ఆయనను చేరుకుంటారు. వారి శ్రేయస్సును ఆయన నిర్ధారిస్తాడు.
కాగా ‘శ్రద్ధ’ అనేది భగవద్గీత సారాంశం. భగవదారాధనలో శ్రద్ధ ప్రధానమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఆకులు, పువ్వులు, ఫలాలు, ఆఖరికి నీరైనా సరే (పత్రం, పుష్పం, ఫలం తోయం) ... పూర్తి భక్తి భావంతో, శ్రద్ధతో సమర్పిస్తే... వాటిని తాను ఆనందంగా స్వీకరిస్తానని చెప్పాడు. కాబట్టి భగవంతుడి ప్రసన్నతను పొందడానికి వేరే దేనికోసం వెతకాల్సిన అవసరం లేదు. మన చుట్టూ సులువుగా లభించే మామూలు వస్తువులను భక్తిగా సమర్పిస్తే చాలు.