
మన మెదడులోని కేంద్ర స్థానంలో... సరిగ్గా రెండు కనుబొమల మధ్య పీనియల్ గ్రంథి ఉంటుంది. శంకువు ఆకారంలో, బఠానీ గింజ పరిమాణంలో ఉండే ఈ గ్రంథి... మన శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ అనే నాడీ ప్రసారకాలను (న్యూరోట్రాన్స్మిటర్స్) ఉత్పత్తి చేసి.. మన నిద్రకు, భావోద్వేగాలకు కారణం అవుతుంది. దీనిలో మామూలు కంటిలో ఉన్నట్టే కాంతి గ్రాహకాలు (ఫొటో రిసెప్టర్స్) ఉంటాయి కనుక దీన్ని ‘మూడో కన్ను’ అని కూడా అంటారు. ఆత్మకు పీఠంగా, ఆధ్యాత్మిక సాక్షాత్కార కారకంగా, పంచేంద్రియాలకు అందని భావనను అందుకోగలిగే ఆరో ఇంద్రియంగా, ఆధ్యాత్మిక సంకేతంగా, భౌతిక-ఆధ్యాత్మిక జగతి మధ్య సంధానంగా... ఇలా అనేక విధాలుగా వివిధ సంస్కృతులు దీన్ని వర్ణించాయి. భారతీయ యోగ పరిభాషలో కనుబొమల మధ్య ఉండే ప్రదేశాన్ని ‘ఆజ్ఞాచక్రం’ అంటారు. ఇది పీనియల్ గ్రంథి ఉండే స్థానాన్ని సూచిస్తుంది.
ఇంద్రియాలను, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి పై వివరణ మనకు ఉపకరిస్తుంది. ‘‘బాహ్య విషయ భోగాల గురించిన ఆలోచనలను పారద్రోలాలి. దృష్టిని భ్రూమధ్యమునందు (కనుబొమల మధ్యభాగంలో) స్థిరంగా ఉంచాలి. మనలో ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడిపించాలి. ఈ ప్రక్రియల ప్రభావం వల్ల మనసు, బుద్ధి, ఇంద్రియాలు సాధకుడి వశంలోకి వస్తాయి. మోక్షపరాయణుడైన ముని ఇటువంటి సాధన ద్వారా ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తుడవుతాడు’’ అని శ్రీకృష్ణుడు ఒక ధ్యాన మార్గాన్ని సూచించాడు. తద్వారా అర్జునుడు తన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకోవడానికి సాయపడే ఒక పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు అందించాడు.
‘విజ్ఞాన భైరవ తంత్రం’లో పరమశివుడు చెప్పిన 112 ధ్యాన సూత్రాలు ఉన్నాయి. ‘‘ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ కనుబొమల మధ్య ఉన్న బిందువుపై దృష్టి కేంద్రీకరించండి. దివ్యమైన శక్తి ప్రజ్వలితమై... మీ తలలోని అగ్రభాగం వరకూ వ్యాపిస్తుంది. అది తక్షణమే మిమ్మల్ని పరమానందంలో ముంచెత్తుతుంది’’ అని వాటిలోని ఒక సూత్రం చెబుతుంది. దీని ప్రకారం... ఏకాగ్రమైన దృష్టిని కనుబొమల మధ్య ప్రాంతానికి తీసుకువచ్చి... పీనియల్ గ్రంథిని సక్రియం చేయడం సాధన చేయాలి. అప్పుడు క్రియాశీలమైన ఆ గ్రంథి ఎటువంటి ఇంద్రియాల సహాయం లేకుండానే మనలో అంతర్గత పారవశ్యాన్ని నింపుతుంది.
కె.శివప్రసాద్
https://www.andhrajyothy.com/2025/navya/spiritual-insights-from-yogic-teachings-1424583.htm