Gita Acharan |Telugu

 

ప్రతి తుపానుకు దాని కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు, కోపం అనే తుపానుకు కూడా... కోరికలు, క్రోధం లేని ఒక కేంద్రం మన మనసులోనే ఉంటుంది. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షం. ఈ ప్రక్రియలో... కోరికలకు మూల కారణమైన ‘నేను’ అనే భావనను తృణీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి. రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి రెండు సులభమైన పద్ధతులను పాటించవచ్చు. మొదటిది... గతంలో మనం కోరికతో నిండిన అవస్థను గాని, కోపం తెప్పించిన ఒక పరిస్థితిని గాని గుర్తుకు తెచ్చుకొని, ఒక సాక్షిగా గమనించాలి. ‘అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే. కానీ ప్రతి ఒక్కరూ ఒకే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు’ అనే మెరుగైన అవగాహనతో పరిస్థితిని విశ్లేషించాలి.

‘‘కామ క్రోధ రహితులకు, చిత్తవృత్తులను జయించినవారికి, పరబ్రహ్మమైన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులకూ అన్నిటిలోనూ ఆ పరమాత్మే గోచరిస్తాడు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి ‘కోరికలు’ అనే వ్యాధి నుంచి, ‘కోపం’ అనే వెర్రితనం నుంచి స్వేచ్ఛ పొందడం ఎలా? భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని ‘లీల’ అంటే ‘కేవలం ఒక నాటకం’ అని చెప్పాయి. అందులో ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదు. ఏడు నుంచి పది రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్టు భావించి... దేన్నీ తీవ్రంగా తీసుకోకుండా... ఉల్లాస మనఃస్థితిలో ఉండడం అనేది రెండో మార్గం. ఇది ఒక నటుడు నాటకం కోసం కోరికను, కోపాన్ని అరువు తెచ్చుకొని, వాటిని అనుభూతి చెందడం లాంటిదే. ఒకసారి వాటిపై పట్టు సాధించిన తరువాత... మనం సుఖదుఃఖాల్లాంటి ఇంద్రియాల జాలంలో చిక్కినా కూడా... నెమ్మదిగా కోరికను, కోపాన్ని అప్పటికప్పుడే వదులుకోవడం నేర్చుకుంటాం. అంటే వర్తమానంలోనే పరమ స్వేచ్ఛను పొందడం, లేదా మోక్షాన్ని పొందడం ఎలాగో తెలుసుకుంటాం.


 

చివరి అడుగు పరమాత్మను శరణువేడడం. ‘‘భగవంతుడు యజ్ఞాలకు, తపస్సులకు భోక్త, సమస్త లోకాలకు, లోకేశ్వరులకు అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు, అంటే అవ్యాజమైన దయ కలిగినవాడు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్‌ తత్త్వాన్ని ఎరిగిన భక్తులకు పరమ శాంతి లభిస్తుంది’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

కె. శివప్రసాద్‌

https://www.andhrajyothy.com/2025/navya/letting-go-of-desire-and-anger-1414782.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!