Gita Acharan |Telugu

‘‘ఒక సముద్రంలో ఎన్నో నదులు నిరంతరం కలుస్తూనే ఉంటాయి. కానీ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అదే విధంగా ప్రాపంచికమైన కోరికల వల్ల చలించని వ్యక్తి శాంతి పొందుతాడు. సర్వోన్నతమైన, అంతిమమైన ఆ గమ్యాన్ని... ఆ శాంతిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గం... ‘నేను’ అనే మమకారాన్నీ, కోరికలనూ త్యజించి, ‘చేసేవాణ్ణి నేనే’ అనే అహంకారాన్ని విడిచిపెట్టడమే. అది సాధించినవారు దేనికీ మోసపోరు. ప్రలోభానికి గురికారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. ఇక్కడ కృష్ణుడు ఆ శాశ్వతమైన స్థితిని (అంటే మోక్షాన్ని... అంతిమమైన స్వేచ్ఛ, సంతోషం, సంవేదనను) పోల్చడానికి సముద్రాన్నీ, నిరంతరం ఇంద్రియాల ద్వారా ఉద్దీపనలను అందుకోవడాన్ని నదులతోనూ పోల్చాడు. ఈ శాశ్వతమైన స్థితిని సాధించిన వ్యక్తి... ఆ తరువాత ప్రలోభాలూ, కోరికలూ తనలో ప్రవేశిస్తున్నప్పటికీ, స్థిరంగా, నిశ్చలంగా ఉండగలడు. రెండోది, సముద్రంలో నదులు సంగమించిన తరువాత... అవి తమ ఉనికిని కోల్పోతాయి. అదే విధంగా, శాశ్వతమైన స్థితిలో కోరికలు ప్రవేశించినా, అవి తమ ఉనికిని కోల్పోతాయి. మూడోది, ఏదైనా ఒక అంశం మన స్థితిని దుర్భరం చేసినట్టయితే... ఆ అంశం బయటి ప్రపంచం తాలూకు ఉద్దీపనల ద్వారా మనలో రేకెత్తిన ప్రతి చర్య (అకర్మ) కావడం, అలాగే దాన్ని నియంత్రించే సమర్థత మనలో లేకపోవడం దానికి కారణాలవుతాయి. కాబట్టి, సముద్రం మాదిరిగా... అటువంటి అస్థిరమైన ఉద్దీపనలను విస్మరించడం నేర్చుకోవాలని శ్రీకృష్ణుడు సూచించాడు.

 

ప్రతి కర్మకూ ఒక కర్త, కర్మఫలం ఉంటాయనేది మన అవగాహన. అయితే, కర్మనూ, కర్మఫలాన్నీ వేరుచేసే మార్గాన్ని శ్రీకృష్ణుడు మనకు అందించాడు. అహంకారాన్ని... ‘నేను’, ‘నేనే కర్తను’ అనే భావాన్ని వదులుకోవాలని ఈ సందర్భంలో ఆయన సూచిస్తున్నాడు. అప్పుడు కర్త, కర్మ వేరవుతారు. ‘శాశ్వతమైన శాంతి’ అనే స్థితిని ఒకసారి సాధించిన తరువాత తిరిగి వెనక్కి రావడం అనేది ఉండదు. ఎల్లప్పుడూ క్రియాశీలంగా ఉండే ఈ విశ్వంలో ఏ కర్మయినా కోటాను కోట్ల కర్మల్లో ఒకటి మాత్రమే. భగవద్గీతలో పేర్కొన్న ఆ శాశ్వతమైన స్థితి... విషాదం తరువాత కలిగే జ్ఞానం ద్వారా వస్తుంది.


Contact Us

Loading
Your message has been sent. Thank you!