Gita Acharan |Telugu

సమర్పణ అంటే యుద్ధంలో ఓడిపోయి... నిస్సహాయ స్థితిలో... విధిలేక లొంగిపోవడం కాదు. సంపూర్ణమైన జ్ఞానంతో, క్రియాశీలమైన ఆమోదంతో చేసే శరణాగతి.

జీవన విధానాలు రెండు రకాలు. మొదటిది సంఘర్షణ. ఇతరులను అధిగమించడానికి, మనకు ఉన్నదానికన్నా ఎక్కువ పొందడానికి, మనకు ఉన్నదానికన్నా భిన్నమైన దాన్ని పొందడానికి మనం సంఘర్షిస్తూ ఉంటాం. రెండోది సమర్పణ... అంటే లొంగిపోవడం. ఇక్కడ సమర్పణ అంటే యుద్ధంలో ఓడిపోయి... నిస్సహాయ స్థితిలో... విధిలేక లొంగిపోవడం కాదు. సంపూర్ణమైన జ్ఞానంతో, క్రియాశీలమైన ఆమోదంతో చేసే శరణాగతి. సమర్పణ... మనం జీవిస్తున్న ప్రతిక్షణానికీ తెలుపుకొనే కృతజ్ఞత.

‘‘సృష్టి చక్రంలో తన బాధ్యత నెరవేర్చకుండా... ఇంద్రియాల్లో తృప్తి పొందుతూ బతికేవాడు పాపి’’ అన్నాడు శ్రీకృష్ణుడు. తన ఇంద్రియాలను సంతృప్తిపరిచే మార్గంలో ఉన్న వాడికి... అది జీవన పోరాటంగా మారుతుంది. ఇంద్రియాలు ఎన్నటికీ సంతృప్తి చెందవు. వాటిని తృప్తి పరచడానికి చేసే పోరాటం జీవితంలో ఉద్రిక్తతకు, ఆందోళనకు కారణం అవుతుంది. కష్టాలను తెస్తుంది. వర్షం నిస్వార్థంగా పడుతుంది. సర్వోన్నత శక్తికి అలాంటి నిస్వార్థమైన చర్యే మూలం. నిస్వార్థ క్రియాచక్రాన్ని అనుసరించమే శరణాగత జీవితం. అటువంటి జీవితం మనకు సంతోషాన్ని ఇస్తుంది. తనలోనే సంతోషాన్ని గుర్తించి, అనుభవించే వ్యక్తికి ఎలాంటి కర్తవ్యం ఉండదని శ్రీకృష్ణుడు చెప్పాడు. అది ఇంద్రియాల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన జీవితం. అక్కడ వ్యక్తి ఉనికి మినహా ప్రత్యేకమైన కోరికలేవీ ఉండవు. అంటే... నిస్వార్థమైన పనులు చేస్తూ, మన మార్గంలో ఏది ఎదురైతే దాన్ని ఆమోదించే స్థితి. కోరికా ఉండదు, కర్తవ్యమూ ఉండదు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే వాటిమీద ఆసక్తి ఉండదు. అతను ఎవరి మీదా... దేనికోసమైనా ఆధారపడడు. ఎవరైతే తమలోనే సంతోషాన్ని పొందుతారో వారికి తమ అర్హతలు, సామర్థ్యాలపై ఎటువంటి ఫిర్యాదులు ఉండవు. తమను ఇతరులతో పోల్చుకోరు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!