
మానవుల బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండాలని, అలా లేనివారి బుద్ధి బహు శాఖలుగా (అనేక భేదాలతో) ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ‘‘సమత్వమే యోగం’’ అని కూడా అన్నాడు. జీవితంలో మనం ఎదుర్కొనే సుఖం-దుఃఖం, గెలుపు- ఓటమి, లాభం-నష్టం లాంటి ధ్రువాల కలయిక ఇది. ఈ ధ్రువాలను అధిగమించే మార్గం కర్మయోగం. అది చివరకు నిశ్చయాత్మకమైన బుద్ధిగా మారుతుంది. సమతుల్యత లేని బుద్ధి మన మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. సుఖం, విజయం, లాభం పొందినప్పుడు... మనశ్శాంతి దానికదే కలుగుతుందని మనం అనుకుంటాం. కానీ కర్మయోగం ద్వారా వచ్చే నిశ్చయాత్మకమైన బుద్ధి... ద్వంద్వాలను అధిగమించడానికి సాయపడుతుందని, అదే మనకు మనశ్శాంతిని ఇస్తుందని కృష్ణుడు చెబుతున్నాడు.
అస్థిరమైన బుద్ధి వివిధ పరిస్థితులను, ఫలితాలను, వ్యక్తులను భిన్నంగా చూస్తుంది. మనం పనిచేసే కార్యాలయంలో మనం కింది ఉద్యోగులకు ఒక కొలమానాన్ని, మన పై అధికారులకు మరొక కొలమానాన్ని వర్తింపజేస్తాం. కుటుంబాల్లో భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వివిధ ప్రమాణాలను అనుసరిస్తాం. మనకు ఇష్టమైన వారి కోసం ఒక నియమం, ఇతరుల కోసం మరొక నియమం పాటించడాన్ని గమనించే పిల్లల్లో... సమత్వం అభివృద్ధి చెందడం కష్టమవుతుంది. దైనందిన జీవితంలో మనం కులం, మతం, మూఢనమ్మకాల లాంటి వాటి ప్రభావానికి గురవుతూ ఉంటాం. ఎదుగుతున్న దశలో... మన మనస్సుల మీద వాటి ముద్ర పడుతుంది. అవి మనల్ని విభజిస్తాయి. ఈ విభజనలు అన్ని వైపుల నుంచి మనల్ని ప్రభావితం చేస్తాయి. బుద్ధి అస్థిరంగా ఉన్నప్పుడు... మన తప్పులను గుర్తించడానికి ఒక కొలమానం, ఇతరుల తప్పులు ఎంచేటప్పుడు మరొక కొలమానం అనుసరిస్తాం. మనం సాయం కోరుతున్నప్పుడు ఒకలా సాయం చేస్తున్నప్పుడు మరోలా ఉంటాం. దీన్ని నివారించడానికి, కర్మయోగ మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగుతుందని, మనశ్శాంతికి పునాది అయిన సమత్వాన్ని సాధించే యోగ్యత పొందుతారని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.
కె.శివప్రసాద్
https://www.andhrajyothy.com/2025/navya/balance-is-yoga-the-essence-of-gita-1402292.html