Gita Acharan |Telugu

సుఖం కలిగినా, దుఃఖం ఎదురైనా... దేనికీ చలించనివాడే స్థితప్రజ్ఞుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటి వ్యక్తి రాగం... అంటే బంధాలకూ, భయానికీ, క్రోధానికీ అతీతంగా ఉంటాడని పేర్కొన్నాడు. సుఖాన్నీ, దుఃఖాన్నీ, లాభాన్నీ, నష్టాన్నీ, జయాన్నీ, పరాజయాన్నీ సమానంగా చూడాలని అర్జునుడికి బోధించాడు. మానవులందరూ సుఖాన్ని కోరుకుంటారు. కానీ మన జీవితాల్లోకి దుఃఖం అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే ఆ రెండూ ఒకే నాణేనికి రెండు వైపుల్లా విడదీయరాని ద్వంద్వాలు. ఇది చేప కోసం ఎరని తగిలించిన కొక్కెం లాంటిది. ఎర వెనుక ఉంటుంది, కనిపించదు.

సుఖ, దుఃఖాల్లాంటి ద్వంద్వాలను అధిగమించి... ద్వంద్వాతీత స్థితికి చేరుకొనేవాడే స్థితప్రజ్ఞుడు. మనం ఒకదాన్ని కోరినప్పుడు... దాన్ని అంటిపెట్టుకున్న మరొకటి అనుసరిస్తూ వస్తుంది. అది బహుశా భిన్నమైన ఆకృతిలో ఉండొచ్చు, కొంతకాలం తరువాత ఎదురుకావచ్చు. మనం మన ప్రణాళికల ద్వారా సుఖాన్ని సాధించుకుంటాం. దానివల్ల అహంకారం పెరుగుతుంది. అది ఉత్తేజం మాత్రమే. అది దుఃఖంగా మారినప్పుడు... అహంకారం దెబ్బతింటుంది. అహంకారం అనే ఈ ఆటని నడిపించేవి ఆందోళన, క్రోధం. ఆ సంగతి స్థితప్రజ్ఞుడు తెలుసుకుంటాడు. అహంకారాన్ని వదిలించుకుంటాడు. భాషల్లో... ద్వంద్వాతీతమైన స్థితిని వర్ణించే మాటలు చాలా అరుదుగా ఉంటాయి. ‘స్థితప్రజ్ఞత అంటే బంధాలకు అతీతంగా ఉండడం’ అని కృష్ణుడు చెప్పడంలోని ఆంతర్యం... స్థితప్రజ్ఞుడు నిర్లిప్తతవైపు ఆకర్షితుడవుతాడని కాదు. అది ఆ రెండిటికీ అతీతమైన స్థితి. స్థితప్రజ్ఞుడు భయం నుంచి, క్రోధం నుంచి విముక్తుడవుతాడు. అవి అతనిలో ప్రవేశించడానికి గానీ, తాత్కాలికంగాగానో, శాశ్వతంగానో ఉండడానికి కానీ వీలుండదు. భయం, క్రోధం అనేవి భవిష్యత్తు లేదా గతం తాలూకు చిహ్నాలు. ప్రస్తుత క్షణంలో వాటిలో దేనికీ స్థానం లేదు. స్థితప్రజ్ఞులు భయ, క్రోధాల నుంచి విముక్తి పొందారంటే... వాళ్ళు వర్తమాన క్షణంలోనే జీవిస్తారని అర్థం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!