
ఒకసారి ఒక మిత్రబృందం పెద్ద నదిని దాటవలసి వచ్చింది. దానికోసం వారు ఒక పడవను తయారు చేసుకున్నారు. నదిని దాటారు. ఆ తరువాత, ఆ పెద్ద పడవ తమకు భవిష్యత్తులో ఉపపయోగపడుతుందని, కాబట్టి మిగతా ప్రయాణమంతా దాన్ని మోసుకువెళ్ళాలని అనుకున్నారు. దానితో వారి ప్రయాణం నెమ్మదించింది. ఇబ్బందికరంగా మారింది. నది ఒక బాధాకరమైన ధ్రువం అనుకుంటే... పడవ ఆ ధ్రువాన్ని అధిగమించడానికి ఉపయోగించే పరికరం. కానీ నది లేని చోట సాగే ప్రయాణంలో... ఆ పడవే భారంగా మారుతుంది. అదే విధంగా మన దైనందిన జీవితాల్లో మనం ఎదుర్కొనే అనేక బాధాకరమైన ధ్రువాల నుంచి మనకు విముక్తి కలిగించే పరికరాలు, ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఇటువంటి తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందడానికి వేదాలు అనేక అనుష్ఠానాలను వివరించాయి. ఈనాటికీ ఈ ఆచారాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రజలు ఆచరిస్తున్నారు. ఆరోగ్యం, వ్యాపారం, పని, కుటుంబం, ఇతర అంశాల్లో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు... ఈ అనుష్ఠానాల సహాయం తీసుకోవడం తార్కికంగా కనిపిస్తుంది.
అయితే... వేదాలకు పైపై అర్థాలు వివరిస్తూ, ఈ జీవితంలో సుఖం, మరణానంతరం స్వర్గం లభించేలా చేస్తానని వాగ్దానాలు చేసే తెలివితక్కువవారి మాటలలో చిక్కుకోవద్దని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ధ్రువాలను (ద్వంద్వాతీత), గుణాలను (గుణాతీత, నిర్గుణ) అధిగమించి ‘ఆత్మవాన్’ (ఆత్మలో స్థిరపడినవాడు)గా మారాలని అర్జునుణ్ణి ఆయన ప్రోత్సహించాడు. ‘‘ఒక పెద్ద సరస్సు దొరికినవాడికి చిన్న కాలువతో అవసరం లేదు. అదే విధంగా ఆత్మలో స్థిరపడినవాడికి ఇతరమైనవన్నీ చిన్నకాలువ లాంటివి’’ అని చెప్పాడు. మన జీవన ప్రయాణంలో పడవ భారాన్ని తలకెత్తుకొని, మనల్ని మనం బాధించుకోకుండా ఉండడమే జ్ఞానం. సుఖాన్ని, శక్తిని పొందడానికి చేసే ప్రయత్నాలు ఎంత వ్యర్థమైనవో అర్థం చేసుకొని, వాటిని అధిగమించాలని శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు.
ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల కలయిక ‘సుఖదుఃఖాలు’ అనే ద్వంద్వాలను తెస్తుందని, అవి అనిత్యం (అశాశ్వతం) కాబట్టి వాటిని ఓర్చుకోవాలనీ అర్జునుడికి శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. వాటిని అధిగమించి ఆ క్షణికమైన అంశాలకు సాక్షిగా ఉండడం నేర్చుకోవాలని సూచించాడు. కృత్రిమమైన సుఖాలకన్నా... ప్రామాణికమైన, శాశ్వతమైన ఆనందమే గొప్పదని ఆయన స్పష్టం చేశాడు.
కె. శివప్రసాద్
ఐఎఎస్
https://www.andhrajyothy.com/2025/navya/the-same-wisdom-is-the-essence-of-the-gita-1370907.html