
మన జీవిత ప్రయాణంలో మనం ఎన్నో విషయాలను వింటూ ఉంటాం. వాటిలో ఒకే అంశం గురించి విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇది మనకు కలవరపాటు కలిగిస్తాయి. వార్తలు కావచ్చు, ఇతరుల అనుభవాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు. వాటి మీద వివిధ అభిప్రాయాలు, వాదనలు విన్నప్పుడు కూడా మన బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే అత్యున్నతమైన యోగ స్థితిని పొందుతామని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు బోధించాడు. దీనిలోని అంతరార్థాన్ని అవగాహన చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. చెట్టు పైభాగం మనకు కనిపిస్తుంది. దాని కింది భాగం వేర్ల మూల వ్యవస్థతో కూడి ఉంటుంది. అది బయటకు కనిపించదు. పైభాగం తీవ్రమైన గాలులకు ఊగుతూ ఉంటుంది. కానీ దానివల్ల వేర్ల వ్యవస్థ ప్రభావితం కాదు. ఎగువ భాగం బాహ్య శక్తుల ప్రభావంతో ఊగిపోతూ ఉంటే... దిగువ భాగం నిశ్చలంగా, సమాధి స్థితిలో ఉన్నట్టు ఉంటుంది. అది స్థిరంగా ఉడడంతోపాటు మొత్తం చెట్టుకు పోషకాహారాన్ని అందించే బాధ్యతను నిర్వహిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతూ... అంతర్గతంగా నిశ్చలంగా ఉండడమే చెట్టుకు యోగ స్థితి.
అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మన బుద్ధి చంచలంగా ఉంటుంది. అది బయటి విషయాల ప్రభావానికి గురై దానంతట అదే ఊగిసలాడుతూ ఉంటుంది. తాత్కాలికమైన స్పందనలు, ఉద్వేగాలు, కోపాల రూపంలో ఈ ఊగిసలాట మన నుంచి బయటకు వస్తుంది. మన జీవితాలను సమస్యాత్మకం చేస్తుంది. మన వ్యక్తిగత జీవితాలనే కాదు, మన కుటుంబ సభ్యుల జీవితాలను, మనం పని చేసే చోట తోటి వారి జీవితాలను కూడా ఇది సమస్యాత్మకంగా మారుస్తుంది. కొందరు ఈ ఊగిసలాటను అణచివెయ్యడం కోసం ముఖానికి ఒక ముసుగు తొడుక్కుంటారు. అందరిముందూ ధైర్యంగా, ఆహ్లాదంగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ ఇది ఎక్కువకాలం సాగదు. ఈ బాహ్యమైన ఊగిసలాటలు అనిత్యమైనవని తెలుసుకొని... నిశ్చలంగా ఉన్న అంతరాత్మను చేరుకోవడమే దీనికి పరిష్కారమని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.