Gita Acharan |Telugu

ఆత్మ చంపదు లేక చంపబడదు; అజ్ఞానులు మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారని శ్రీకృష్ణుడు అంటారు. అది పుట్టుక లేనిది, శాశ్వతమైనది, మార్పులేనిది, పురాతనమైనది. మనం చివికిపోయిన, పాతవి అయిన వస్త్రాలను వదిలివేసి కొత్తవి ధరించినట్లుగా ఆత్మ భౌతిక దేహాలను మారుస్తుందని ఆయన అంటారు (2.19, 2.20).

సాంకేతిక పరిభాషలో దీన్ని శక్తి పరిరక్షణ సూత్రం (law of conservation of energy), ద్రవ్యరాశి, శక్తి యొక్క పరస్పర మార్పిడి సూత్రం (principle of inter-convertibility of mass and energy) ద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు. ఆత్మను శక్తితో పోలిస్తే శ్రీకృష్ణ భగవానుని బోధనలు స్పష్టమవుతాయి.

శక్తి పరిరక్షణ సూత్రం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలం. ఉదాహరణకు ఉష్ణశక్తి స్థానాలు (థర్మల్ పవర్ స్టేషన్లు) ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక బల్బు విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం శక్తి మార్పిడి జరుగుతోంది కానీ నాశనము కాదు. బల్బు జీవితం పరిమితకాలం. ఇది కాలిపోతే కొత్త బల్బును పెడతాము కానీ విద్యుత్తు అలాగే ఉంటుంది. ఇది జీర్ణమైన వస్త్రాలను విడిచి కొత్తవాటిని ధరించడం వంటిది.

మనకు చావు ఒక అనుమానం మాత్రమే అనుభవం కాదు. ఇతరులు చనిపోవడం చూసినప్పుడు మనందరం కూడా ఏదో ఒక రోజు మరణిస్తామని అనుకుంటాము. మనకు తెలిసిన ప్రకారం చావు అంటే దేహం కదలక పోవడం, ఇంద్రియాలు పనిచేయకపోవడం. మన భౌతిక మరణం గురించి తెలుసుకునే అవకాశం కానీ, దాన్ని అనుభూతి చెందే మార్గం కానీ మనకు తెలియదు. మన అందరికీ మరణం తధ్యమని మనం నమ్ముతాము. మన జీవితాలు మరణానికి సంబంధించిన భయాల చుట్టూ తిరుగుతాయి.

శ్రీకృష్ణ భగవానుడు 'ఏదైనా సాధ్యమే కానీ మరణం సాధ్యం కాదు, ఎందుకంటే అది ఒక భ్రమ' అని అంటారు. బట్టలు చిరిగి పోయినప్పుడు అవి మనల్ని పరిసరాల నుంచి సంరక్షించలేవు. అందుకే కొత్త వాటిని వేసుకుంటాము. అలాగే మన భౌతిక దేహం దాని కర్తవ్యాలను నిర్వహించ లేనప్పుడు మార్చివేయబడుతుంది.

 

https://epaper.andhrajyothy.com/article/NTR_VIJAYAWADA_MAIN?OrgId=27124aabf738&eid=182&imageview=1&standalone=1&device=desktop


Contact Us

Loading
Your message has been sent. Thank you!