Gita Acharan |Telugu

యుద్ధ విముఖుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ... స్వధర్మం గురించి వివరించాడు. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి వెనుకాడకూడదని, ఎందుకంటే అది అతని స్వధర్మమమనీ స్పష్టం చేశాడు. భగవద్గీతను ప్రారంభిస్తూ ‘‘‘అది’ శాశ్వతమైనది, అవ్యక్తమైనది, అంతటా వ్యాపించి ఉన్నది’’ అని చెప్పాడు. ‘అది’ అనే మాటను ‘ఆత్మ’ అని చెప్పుకొంటే... అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. తరువాత ఆయన స్వధర్మం గురించి తెలిపాడు.

 

అంతరాత్మ గురించిన జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ మన ప్రస్తుత స్థితి, రెండోది స్వధర్మాన్ని గురించి తెలుసుకోవడం, అంతిమంగా... అంతరాత్మను చేరుకోవడం. వాస్తవంలో, ‘మన ప్రస్తుత స్థితి’ అనేది మన స్వధర్మం, అనుభవాలు, విజ్ఞానం, జ్ఞాపకాలు, చంచలమైన మనస్సు ద్వారా పోగు చేసుకొనే ఊహాగానాల సమ్మేళనం. మానసికమైన ఈ భారాలన్నిటి నుంచీ మనల్ని మనం విముక్తి చేసుకున్నప్పుడు... స్వధర్మం మెల్లగా వ్యక్తం కావడం ప్రారంభిస్తుంది. ‘క్షత్రియ’ అనే మాట ‘క్షత్‌’, ‘త్రయతే’ అనే పదాల సమ్మేళనం. ‘క్షత్‌’ అంటే హాని, ‘త్రయతే’ అంటే రక్షణ ఇవ్వడం. హాని నుంచి రక్షణ ఇచ్చేవారు క్షత్రియులు. మాతృమూర్తి దీనికి చక్కటి ఉదాహరణ. తల్లి తన బిడ్డలకు గర్భంలో రక్షణ కల్పిస్తుంది. వారు పుట్టాక... తమ కాళ్ళమీద తాము నిలడేవరకూ కాపాడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే మొదటి క్షత్రియ ఆమె. బిడ్డల సంరక్షణలో ఆమెకు శిక్షణ లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. కానీ అది ఆమెకు సహజంగానే వచ్చేస్తుంది. స్వధర్మం అనే లక్షణానికి ఇది సంగ్రహమైన అవలోకనం.

 

ఒకసారి ఒక గులాబీ... గంభీరమైన తామర పువ్వు చేతిలో దెబ్బతింది. అప్పుడు తనుకూడా తామర పువ్వు కావాలనే కోరిక దానిలో మొదలైంది. కానీ ఒక గులాబీ... కమలంగా మారే అవకాశం లేదు. తన సామర్థ్యం కన్నా భిన్నంగా ఉండాలని గులాబీ కోరుకుంది. మనలో కూడా ఇటువంటి ధోరణులే ఉంటాయి. మనం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దీని ఫలితంగా, అర్జునుడిలా నిరాశనూ, నిస్పృహనూ ఎదుర్కొంటూ ఉంటాం. గులాబీ తన రంగును, పరిమాణాన్నీ, ఆకృతినీ మార్చుకోగలదు. కానీ అది అప్పటికీ గులాబీగానే ఉంటుంది. అదే దాని స్వధర్మం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!