
మనం కొన్ని పనులు చేస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. ఇతరులు కూడా అలాగే చేస్తారు. ఆ పనుల్లో కొన్నిటికి మంచివి అనీ, మరికొన్నిటికి చెడ్డవి అని పేర్లు పెట్టడం చుట్టూ మన జీవితాలు అల్లుకొని ఉంటాయి. ‘‘సమత్వ బుద్ధి కలిగినవాడు పాప పుణ్యాలు రెండిటినీ ఈ లోకంలోనే త్యజిస్తాడు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే మనం ఈ సమత్వ యోగాన్ని చేరుకున్నట్టయితే... ఆ తరువాత ‘అవి మంచివి, ఇవి చెడ్డవి’ అని పేర్లు పెట్టడం మానేస్తాం. అనవసరమైన అభిప్రాయాలకు చోటివ్వం.
మన మనస్సు అనేక రంగుటద్దాలతో కప్పి ఉంటుంది. ఎదిగే సమయంలో మన తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు వెల్లడించే అభిప్రాయాలు, భావాల నియంత్రణలో ఉంటాం. అలాగే మనం జీవిస్తున్న దేశంలోని చట్టాల ద్వారా కూడా. ఇవన్నీ మన మనసుల్లో ముద్రవేసుకొని ఉంటాయి. మనం ఈ రంగుటద్దాల ద్వారానే అన్ని విషయాల్నీ, పనుల్నీ చూస్తూ ఉంటాం. వాటిని మంచివనీ, చెడ్డవనీ ముద్ర వేస్తాం.
యోగ స్థితి... ఈ రంగులన్నీ వాటంతట అవే కరిగిపోయేలా, మనం అన్ని విషయాలనూ స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఇది రెమ్మలకు బదులు మూలాలను నాశనం చేయడం లాంటిది. అంటే ప్రతి దానికీ మన సొంత రంగును (అభిప్రాయాన్ని) జోడించడానికి ప్రయత్నించకుండా... పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించడం.
జీవితంలో ఈ రంగుటద్దాలు మనల్ని ముడుచుకుపోయేలా చేస్తాయి. తద్వారా నిర్ణయం తీసుకోడానికి అవసరమైన కీలక సమాచారాన్ని కోల్పోతాం. సరైనదికాని లేదా తప్పుగా అన్వయించిన సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు, పనులు అనివార్యంగా విఫలమవుతాయి. తటస్థంగా ఉండడం అంటే ఒక సమస్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఏకకాలంలో వాదించాల్సిన పరిస్థితి లాంటిది. న్యాయమూర్తి నిర్ణయాలు తీసుకొనే ముందు ఇరు పక్షాల వాదలను వినడం లాంటిది. అన్ని జీవులలో తనను, అన్ని జీవులను తనలోనూ చూడడం లాంటిది. అంతిమంగా అంతా శ్రీకృష్ణమయమే. ఒక పరిస్థితిలో మనం కూరుకుపోకుండా.. మనల్ని మనం వేరు చేసుకొని.. ఆ పరిస్థితిలోని ఇరు పార్శ్వాలనూ అర్థం చేసుకొనే సామర్థ్యం ఇది. ఈ సామర్థ్యం వికసించాక... మనల్ని మనం కేంద్రీకరించుకోవడం మొదలుపెడతాం. ఎవరైనా క్షణికమైన యోగ స్థితిని (సమతుల్యతను) పొందినప్పుడు కూడా... ఆ సమయంలో వారి ద్వారా జరిగే పని సమంజసంగా ఉంటుంది. సాధనతో ఆ స్థితి శాశ్వతమవుతుంది.
https://www.andhrajyothy.com/2024/navya/lets-remove-the-mirror-tints-1294225.html