
అర్జునుడు మనసును గాలితో పోలుస్తూ.... దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలని ప్రశ్నిస్తాడు. అది కష్టమైనదని శ్రీకృష్ణుడు చెబుతూ... వైరాగ్యాన్ని అవలంబించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తాడు. మనలోని జ్ఞాపకశక్తిని ఉపయోగించి... ఇంద్రియాలు అందించే సమాచారంలో ఏది సురక్షితమైనదో, ఏది సురక్షితం కాదో నిర్ధారించేలా మన మనసు శిక్షణ పొంది ఉంటుంది. మానవ పరిణామక్రమంలో ఆ సామర్థ్యమే మనం జీవించడానికి, అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. మనసుకు ఉన్న ఇదే సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి కూడా ఉపయోగించవచ్చు. దాన్నే ‘జాగరూకత’ అని కూడా అంటారు. మనం ఈ సామర్థ్యం ద్వారా మన నిర్ణయాల నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. అందుకోసం కొత్త ఆలోచనలను మనసుకు అందించాలి. మానవుల్లో ఇది సహజంగా రాదు. కాబట్టి ఆచరణ ద్వారా ఆ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. ఇది మెదడులో కొత్త శక్తిని నింపడం లాంటిది.
రాగాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ‘రాగం’ అంటే భౌతిక ప్రపంచంలో అందం, ఆస్తులు, అభివృద్ధి లాంటి ఆనందాల కోసం విస్తృతంగా పాకులాడడం. ద్వంద్వాల సూత్రం ప్రకారం ప్రతి రాగ భావం/ భావన వైరాగ్యంతో ముగుస్తుంది. కానీ మన దృష్టి ఎప్పుడూ రాగం పైనే ఉంటుంది. అందుకే వైరాగ్యాన్ని విస్మరిస్తాం.
స్టోయిసిజం లాంటి కొన్ని తత్త్వాలు వైరాగ్యానికి శిఖరం లాంటి మరణం ప్రయోజనాన్ని సమర్థిస్తాయి. దీన్ని ‘మెమొంటో మోరీ’ అంటారు. అంటే మరణాన్ని మళ్ళీ మళ్ళీ దర్శించడం లేదా అనుభూతి చెందడం. ఈ పద్ధతిలో వారు చావుకి గుర్తుగా (జ్ఞాపకార్థంగా) పని చేసే చోట లేదా ఇంట్లో ప్రముఖ స్థానంలో దేన్నైనా ఉంచి, దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ మృత్యువు మీద ధ్యాస నిలబడేలా చేస్తారు. భారతీయ వేదాంతం దీన్నే ‘శ్మశాన వైరాగ్యం’ అంటుంది. మనం వైరాగ్యాన్ని సాధన చేయడం మొదలుపెడితే.... అది మనసును స్థిరపడేలా చేస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు.