Gita Acharan |Telugu

తీవ్రమైన వాంఛ, ప్రగాఢ సంకల్పం అనే మాటలు వింటూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, అభిరుచులను తీర్చుకోవడానికి, విధులను కొనసాగించడానికీ కావలసిన శక్తితో, ఉత్సాహంతో నిండి ఉండడం అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ‘సంకల్పాగ్ని’ అని అనుకుందాం. అటువంటి శక్తిని ఆత్మ సాక్షాత్కారం కోసం ఉపయోగించినప్పుడు... దాన్ని ‘యోగాగ్ని’ అంటారు. ‘‘మరికొందరు యోగులు అన్ని ఇంద్రియ క్రియలను, అన్ని ప్రాణ క్రియలను జ్ఞానంతో ప్రకాశించే, ఆత్మసంయమయోగ రూపంలో ఉండే అగ్నిలో దగ్ధం చేస్తారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.

నిత్య జీవితంలో మనం పరమాత్మకు అందమైన పువ్వులు, రుచికరమైన ఆహారం లాంటి ఇంద్రియాకర్షక వస్తువులను సమర్పిస్తాం. వీటన్నిటినీ అధిగమించాలనీ, యజ్ఞం (నిష్కామకర్మ) అంటే కేవలం ఇంద్రియ వస్తువులను సమర్పించడం మాత్రమే కాదనీ, రుచి, అందం లేదా వాసన లాంటి ఇంద్రియ కార్యకలాపాలను కూడా అర్పించడం అని ఈ శ్లోకం చెబుతుంది. ఇంద్రియ వస్తువుల పట్ల ఆసక్తి, విరక్తి ద్వారా ఇంద్రియాలు మనల్ని బాహ్య ప్రపంచంతో కలుపుతూనే ఉంటాయి. ఈ ఇంద్రియాలను త్యాగం చేసినప్పుడు... అంటే ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి, విరక్తి నశించిపోయిన తరువాత.. మిగిలేది పరమాత్మతో ఐక్యతే.

‘‘కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపడతారు. కొందరు యత్నశీలుల స్వాధ్యాయరూప జ్ఞాన యజ్ఞములను ఆచరిస్తారు’’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. స్వ-అధ్యయనాన్ని యజ్ఞంలో ఒక భాగంగా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఈ ప్రక్రియ మనస్తత్వశాస్త్రం, వైద్యం, సమకాలీన వ్యక్తిత్వ వికాస రచనల లాంటి అనేక విషయాల పుట్టుకకు దారి తీసింది. బాల్యం నుంచే మనం పుట్టుకద్వారా పొందిన జాతీయత, కులం లేదా మతం లాంటి విభజనల ద్వారా నిరంతరం గుర్తింపు పొందుతూ ఉంటాం. ఈ గుర్తింపుల రక్షణకే మనం జీవితాంతం పాటుపడతాం. అణచివేత లేదా హింస ద్వారా ఈ విభజనలను చిన్న వయసులోనే మన మీద బలవంతంగా రుద్దుతారు. తెలివైనవారు, తెలివితక్కువవారు, కష్టపడేవారు లేదా సోమరిపోతులు లాంటి లక్షణాల ఆధారంగా కూడా ఈ విభజన జరుగుతుంది. ఈ జాబితాకు అంతం లేదు. అదే విధంగా మనం అనేక అంశాల ఆధారంగా మన గురించి, ఇతరుల గురించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. వాటిని రక్షించడానికి మన శక్తిని వృధా చేస్తూ ఉంటాం. ‘స్వీయ అధ్యయనం’ అంటే ఈ కృత్రిమ విభజనలను పరిశీలించి, వాటిని త్యజించడం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!