Gita Acharan |Telugu

మనమేమిటో భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా, సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది.

అంతర్లీనంగా, అర్జునుడి సందిగ్ధం ఏమిటంటే, ఒకవేళ అతను తన మిత్రులను, బంధువులను, పెద్దలను, గురువులను రాజ్యం కోసం చంపితే, ప్రపంచం దృష్టిలో తన ప్రతిష్ట ఏమవుతుందా అని! ఇది చాలా తార్కికంగా కనబడుతుంది. భగవద్గీత చెప్పిన ప్రకారం జీవించాలంటే దాటాల్సిన మొట్టమొదటి అవరోధమిది.

అర్జునుడి అసలైన సందిగ్ధం అతని భవిష్యత్తును గురించి, కానీ మనకు కర్మ చేసే హక్కు తప్ప కర్మఫలాల పై అధికారము హక్కులేదని కృష్ణుడంటారు. ఎందుకని? ఎందుకంటే కర్మ వర్తమానంలో జరుగుతుంది కానీ కర్మఫలం అనేది భవిష్యత్తులో వచ్చేది.

            అర్జునుడి లాగానే మనము కూడా కర్మఫలాలను ఆశించి అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆధునిక జీవనం కొన్నిసార్లు మనం భవిష్యత్ పరిణామాలను నియంత్రించగలమన్న భావనను కలిగిస్తుంది. కానీ భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని అనేక సంభావనల కలయిక. మన అహంకారమే గతంపై ఆధారపడి, వర్తమానంలో భవిష్యత్తును చూపిస్తూ ఇటువంటి సందిగ్దాలు సృష్టిస్తుంది. దీనివల్ల మనం వర్తమానంలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.

            అంతరిక్షాన్నే తీసుకుంటే ఈ సమస్త విశ్వం, నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటి యొక్క విశిష్టత భ్రమణం. ఇది ఒక స్థిరమైన అక్షము (ఇరుసు), తిరిగే చక్రం ద్వారా ఏర్పడుతుంది. అక్షం కదలదు కానీ అక్షం లేకుండా చక్రం తిరగడమనేది సాధ్యం కాదు. ప్రతి తుఫాన్ కి కూడా ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది. అది లేకుండా తుఫాను చలనము పొందలేదు. కేంద్రం నుంచి ఎంత దూరంగా ఉంటే అలజడి అంత ఎక్కువగా ఉంటుంది.

            మనలో కూడా ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది; అదే మన అంతరాత్మ. అనేక లక్షణాలను కలిగిన, అలజడితో కూడుకున్న జీవితం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతిష్ట అనేది జీవితంలో మనము లోనయ్యే అలజడులలో ఒకటి. అర్జునుడు కూడా తన ప్రతిష్టను గురించిన సందిగ్ధంలోనే ఉన్నాడు. అతనిలాగానే మనం కూడా ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాన్ని బట్టి మన ప్రతిష్టను గురించి నిర్ధారించుకుంటాము, మనలోకి మనం చూసి కాదు.

            భగవద్గీత మనం వర్తమానంలో జీవించాలనీ, అంతరాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండాలని చెబుతుంది.


Contact Us

Loading
Your message has been sent. Thank you!