Gita Acharan |Telugu

ప్రతి నాగరికతలో సమాజ శాంతి, సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా, మరికొన్నిటిని చేయకూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు శిక్షార్హమైన నేరాలుగా మారాయి. న్యాయశాస్త్రం ప్రకారం ఒక నేరంలో ఉద్దేశం, అమలు... ఈ రెండిటి మీదా ఆధారపడి నేర నిర్ధారణ జరుగుతుంది. ఉద్దేశం అనేది నేరం చేయాలనే ఆలోచన. ఏ వ్యక్తినైనా దోషిగా నిలబెట్టడానికి ఈ రెండు అంశాల్లో రుజువు అవసరం. ‘‘ఎవరి కర్మలన్నీ శాస్త్ర సమ్మతాలై, కామ-సంకల్ప వర్జితాలై... అంటే కోరిక, సంకల్పాలను వదిలిపెట్టినవై ఉంటాయో, అలాగే ఎవరి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మమవుతాయో... అలాంటి మహా పురుషుడినే జ్ఞానులు ‘పండితుడు’ అని అంటారు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఉద్దేశాన్ని సంకల్పంగా, అమలును కోరిక లేదా వాంఛగా గుర్తిస్తే... శ్రీకృష్ణుడు చెప్పిన సూక్తిని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా సమాజంలో ఎవరైనా నేరపూరిత ఉద్దేశంతో తిరుగుతున్నప్పటికీ, నేరం చేయనంతవరకూ ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ముందుగానే ఉద్దేశాన్ని వదులుకోవడంతో పాటు సంకల్పాన్ని కూడా వదులుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. చట్టం పట్ల భయం, ధనం లాంటి వనరుల కొరత, లేదా తన ప్రతిష్టను నిలబెట్టుకోవడం లాంటి వివిధ కారణాల వల్ల మనుషులు తమ కోరికలను లేదా వాంఛలను వదులుకోవడం జరుగుతుంది. కానీ సంకల్పం చాలా లోతుగా ఉంటుంది. జీవితకాలంలో ఎప్పుడైనా ఒక బలహీనమైన క్షణంలో... ఆ పని చెయ్యాలనే వాంఛగా అది మారవచ్చు. కాబట్టి కేవలం వాంఛను మాత్రమే కాకుండా, కోరికలకు చోదకశక్తి అయిన సంకల్పాన్ని కూడా వదులుకోవాలని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు.

విద్యను, ఆస్థిని, వ్యక్తిగత వృద్ధిని సాధించాలనే సంకల్పం, కోరిక కలిగి ఉండాలని మనకు చిన్నతనం నుంచి పెద్దలు పదేపదే చెబుతారు. కాబట్టి ఈ అస్తిత్వ సత్యాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి మనకు కష్టమవుతుంది. గమనించదగిన విషయం ఏమిటంటే కోరిక అనేది శ్రేష్టమైనదైనా, హీనమైనదైనా... అది కోరికే. కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి. కోరిక, సంకల్పాలను వదిలేసిన వ్యక్తి నిశ్చల సమాధిని పొందుతాడు. ఆసక్తి, భయం, కోపం నుంచి విముక్తి పొందుతాడు.

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!