
‘‘నాకు కర్మ ఫలాసక్తి లేదు. కాబట్టి కర్మలు నన్ను అంటవు. నా తత్త్వాన్ని తెలిసినవారు కర్మబద్ధులు కారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ‘‘కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలం మీద కాదు’’ అనే ఆయన బోధను ఇది గుర్తు చేస్తుంది. పరమాత్మగా కూడా ఆయన అనుసరించే మార్గం ఇదే. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ... తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించాడు. ‘‘అర్జునా! ప్రాచీనులైన ముముక్షువులు నా తత్త్వ రహస్యాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా నీ పూర్వుల మాదిరిగా నిష్కామభావంతో కర్మలను ఆచరించు’’ అని ఉపదేశించాడు.
మన జీవితపు సాధారణ గమనంలో... కర్మఫలాన్ని పొందడానికే మనం కర్మలు చేస్తాం. అయితే కర్మఫలాన్ని వదులుకోవాలని చెప్పినప్పుడు కర్మలను కూడా వదులుకుంటూ ఉంటాం. అంటే కర్మను పరిత్యజిస్తాం. కానీ పరిత్యాగానికి పూర్తిగా భిన్నమైన అర్థాన్నీ, మార్గాన్నీ శ్రీకృష్ణుడు వెల్లడించాడు. కర్మఫలం, కర్తృత్వం... ఈ రెండిటితో అనుబంధాన్ని వదిలేయాలనీ, అయితే కర్మలు చేస్తూనే ఉండాలనీ చెప్పాడు. యుద్ధం ఒక కర్మ మాత్రమేననీ, దాన్ని ఆచరించాలనీ అర్జునుడికి ఆయన ఇచ్చిన సలహాను ఈ నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవాలి.
మన కర్మల్లో కర్తృత్వాన్ని వదిలెయ్యడం అంత తేలిక కాదు. కానీ నాట్యం, చిత్రలేఖనం, చదవడం, బోధన, తోటపని, వంట, క్రీడలు, శస్త్రచికిత్స తదితర కార్యకలాపాలలో లోతుగా నిమగ్నమైనప్పుడు... మనమందరం తరచుగా కర్తృత్వం లేకుండానే వ్యవహరిస్తాం. ఈ మానసిక స్థితిని ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో ‘ప్రవాహ స్థితి’ అంటారు. మన ప్రయత్నాలకు విశ్వం ప్రతిస్పందిస్తుందని గ్రహించి, కర్తృత్వం లేకుండా జీవించిన అందమైన క్షణాలను గుర్తించి, వాటిని జీవితంలో విస్తరించడమే దీని సారాంశం.
జీవితం స్వతహాగా ఆనందమయమైనది, అద్భుతమైనది. దానికి కర్తృత్వం లేదా కర్మఫలం తాలూకు సాయం అవసరం లేదు. మనం కర్తృత్వాన్నీ, కర్మఫలాన్నీ విడిచిపెట్టినప్పుడు... పరమాత్మలో ఐక్యమైపోతాం. మన కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతాం.