Gita Acharan |Telugu

ఒక కాయ దాని తల్లి చెట్టు నుంచి పోషకాలు గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుంచి వేరుపడుతుంది. విత్తనం దశ నుంచి చివరకు చెట్టుగా మారేవరకూ వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు, అపరిపక్వమైన కాయ పండే వరకూ... అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకూ తల్లి చెట్టును అంటిపెట్టుకొని ఉండాల్సిందే. అపరిపక్వమైన కాయను పండిన పండు ఆకర్షించి, అది చెట్టును విడిచిపెట్టేలా చేయకూడదు. ఎందుకంటే... అపరిపక్వమైన కాయ స్వతంత్రంగా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇంకా సిద్ధంగా లేదు. తల్లి చెట్టు నుంచి అవసరమైన పోషణ పొందడానికి సమయం కేటాయించకపోతే అది నశిస్తుంది. ఆ పోషణ పండిన పండు ద్వారా అది పొందే అవకాశం లేదు. అందుకే ‘‘పరమాత్మ స్వరూపంలో నిశ్చలమైన స్థితిని పొందిన జ్ఞాని... శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించే అజ్ఞానులను భ్రమకు లోను చేయకూడదు. అంటే కర్మల పట్ల వారికి అశ్రద్ధ కలిగించకూడదు. పైగా, తను కూడా శాస్త్ర సమ్మతమైన సమస్త కర్మలనూ చక్కగా ఆచరించాలి. వారితో కూడా అలాగే చేయించాలి’’ అని శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో (మూడో అధ్యాయం– 26వ శ్లోకం) సూచించాడు. కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి మూడో అధ్యాయం ఆరో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినదానికి ఇది కొనసాగింపు. ఆ విధంగా కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించుకున్న వ్యక్తుల మనస్సు ఇంద్రియ వస్తువులకు సంబంధించిన ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే... అటువంటివారు తమనుతాము మోసగించుకొనే కపటులని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ఒక అజ్ఞాని చేసే కర్మలను ఒక జ్ఞాని బలవంతంగా నిరోధించినా పరిస్థితి ఇలాగే ఉంటుంది.

 

వందమంది విద్యార్థులు ఉన్న తరగతిలో... ఒక్కొక్కరూ తమతమ స్వభావం, మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి జీవితంలో ప్రేరేపిత కర్మలు వ్యర్థాలని గ్రహించిన సన్న్యాసి... కుటుంబ జీవితం నుంచి వైదొలగాల్సిందిగా బ్రహ్మచారిని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే బ్రహ్మాచారి తన సొంత కర్మల ద్వారా ఇవన్నీ వ్యర్థాలని అర్థం చేసుకోవాలంటే... అతను స్వయంగా వాటిని అనుభవించాలి. అది తప్ప మరో మార్గం లేదు.

 

శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి ముందు... అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం ఏర్పడడం కోసం ఎదురుచూశాడు. అప్పటివరకూ అతణ్ణి ప్రాపంచిక కర్మలు చేస్తూ ఉండనిచ్చాడు. జీవితంలో సుఖదుఃఖాలు అనుభవించనిచ్చాడు. అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నాడు. మనిషి లోపల ఆసక్తి కలిగినప్పుడే... మనం చూసే ప్రతి వాస్తవికతా, మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితీ మనకు గురువుగా మారే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలోనే మనం నేర్చుకోవడం సాధ్యమవుతుంది.

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!