Gita Acharan |Telugu

‘యోగం’ అంటే బహిరాత్మను అంతరాత్మతో కలపడం. కర్మ, భక్తి, సాంఖ్య, బుద్ధి లాంటి అనేక మార్గాల ద్వారా... వ్యక్తి తన స్వభావాన్ని బట్టి... తనకు అనువైన పద్ధతిలో యోగాన్ని సాధించవచ్చు. ప్రతిఫలాన్ని ఆపేక్షిస్తూ చేసే పనుల్ని త్యజించాలనీ, దివ్యమైన జ్ఞానంలో బుద్ధిని నిలకడగా ఉంచి చేసే కర్మలకన్నా అవి చాలా తక్కువ స్థాయికి చెందినవనీ అర్జునుడికి శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ దివ్యజ్ఞానంతో చేసే కర్మల్లో బుద్ధి సమన్వయంతో (పొందికతో) ఉంటుందనీ, అదిలేని వారి బుద్ధి పరిపరివిధాల పోతుందనీ చెప్పాడు.

 

భూతద్దం కాంతిని కేంద్రీకరించినట్టు... బుద్ధి సమన్వయాన్ని పొందితే... ఎలాంటి మేథోపరమైన ప్రయాణాన్నయినా చేసే సమర్థత దానికి చేకూరుతుంది. అంతరాత్మలోకి ప్రయాణంతో సహా, ఏ ప్రయాణానికైనా దిశ, కదలిక కావాలి. అంతరాత్మలోకి ప్రయాణించే దిశ గురించి చెబుతూ... ‘బుద్ధి యోగం’ గురించి శ్రీకృష్ణుడు ప్రస్తావించాడు. సాధారణంగా, భౌతిక ప్రపంచంలోని కోరికలను నెరవేర్చుకోవడానికి మన బుద్ధిని ఉపయోగించుకుంటూ ఉంటాం, కానీ అంతరాత్మలోకి మన ప్రయాణాన్ని సాగించడానికి దాన్ని మనం వాడుకోవాలి. మనలో లోతుగా పాతుకుపోయిన విశ్వాసాలనూ, భావోద్వేగాలనూ, ఊహలనూ, ఆలోచనలనూ, చర్యలనూ, ఆఖరికి మనం మాట్లాడే పదాలనూ... ఇలా ప్రతిదాన్నీ మనం ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు... అంతరాత్మలోకి మనం చేసే ప్రయాణంలో మేధస్సును ఉపయోగించడం మొదలవుతుంది. అదే మనకి దారి చూపిస్తుంది. అత్యున్నత సత్యాన్ని వెలికి తీసేలా చేసేది... ప్రశ్నించడమే.

కర్మ ఫలాలను పొందాలన్న కాంక్ష కలిగినవారు దౌర్భాగ్యులని శ్రీకృష్ణుడు చెప్పాడు. కర్మ తాలూకు ఫలాలు సంతోషాన్నిస్తాయనే ఆలోచనాధోరణిని మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఈ ప్రపంచంలో... ప్రతి సంతోషం కొద్దిసేపటికే బాధగా మారుతుంది, అది మన దుఃఖాన్ని మరింత పెంచుతుంది. ఇలాంటి వాటినుంచి మనల్ని కాపాడతానని శ్రీకృష్ణుడు ఎక్కడా చెప్పలేదు, కానీ వాటిని అధిగమించడానికి బుద్ధిని ఉపయోగించమని చెప్పాడు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!