Gita Acharan |Telugu

కర్ణుడు, అర్జునుడు... వీరిద్దరూ కుంతీదేవి కుమారులే. కానీ ప్రత్యర్థులుగా వేర్వేరు పక్షాల తరఫున పోరాడారు. కర్ణుడు శాపగ్రస్తుడు. ఆ శాపాల కారణంగా... అర్జునుడితో కీలకమైన యుద్ధం చేస్తున్న సమయంలో... అతనికి ఉన్న పోరాట కౌశలం, అనుభవం అతణ్ణి కాపాడలేకపోయాయి. యుద్ధంలో ఓడిపోయాడు, మరణించాడు. ఈ పరిస్థితి మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం కర్ణుడిలాంటి వాళ్ళమే. జీవితంలో మనం ఎన్నో నేర్చుకుంటాం, విజ్ఞానాన్నీ, అనుభవాన్నీ సంపాదిస్తాం. కానీ కీలకమైన సందర్భాల్లో... మన సహజ ప్రవృత్తికి అనుగుణంగా ఆలోచించి, వ్యవహరిస్తాం కానీ, మన అవగాహనకు లేదా జ్ఞానానికి అనుగుణంగా కాదు. ఎందుకంటే, మన జ్ఞానం లోతు... మనకు అవసరమైన స్థాయి కన్నా తక్కువగా ఉంటుంది. దీన్ని సూచిస్తూ...  ‘భగవద్గీత’లో వాస్తవం, సత్యం గురించి అనేక కోణాల్లో శ్రీకృష్ణుడు పదేపదే వివరించాడు. మనలో అంతరాత్మ, బహిరాత్మ ఉంటాయనీ, అవి ఒకే నదికి రెండు తీరాల్లాంటివనీ భగవద్గీత చెబుతోంది. భౌతికమైన శరీరం, మన భావోద్వేగాలు, ఆలోచనలు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడిన బహిరాత్మతో నేనని సాధారణంగా భావిస్తూ ఉంటాం. అయితే, సత్యాన్ని గ్రహించి... అన్ని జీవులలోనూ ఉన్నది, శాశ్వతమైనదీ, ఎలాంటి మార్పూ లేనిదీ అయిన అంతరాత్మను నేనేనని తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు తెలిపాడు. అంతరాత్మను... అంటే ఆవలి తీరాన్ని... చేరిన తరువాత మాత్రమే... ‘ఉన్నది ఒక్కటే తీరం’ అనే జ్ఞానోదయం కలుగుతుంది.

 వంద పుస్తకాలు చదవడం కన్నా భగవద్గీతలోను... ముఖ్యంగా రెండో అధ్యాయాన్ని... అనేకసార్లు చదవడం ఉత్తమం. చదివిన ప్రతిసారీ భగవద్గీత ఒక భిన్నమైన అవగాహనను అందిస్తుంది. మనలో వివేచనను కలిగిస్తుంది. అప్పుడు ‘నేను’ అనే భావన క్రమంగా తొలగి, ఆనందం వెల్లివిరుస్తుంది.


Contact Us

Loading
Your message has been sent. Thank you!