
ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం చాలా కష్టం అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే అలా ఆలోచించే వ్యక్తులకు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు భరోసా ఇస్తూ... కర్మ యోగంలో చిన్న ప్రయత్నాలే పెద్ద ప్రతిఫలాలను ఇస్తాయని చెప్పాడు. తగినంత (యుక్తమైన) ఆహారం, విశ్రాంతి, నిద్ర కలిగి ఉండి, యుక్తమైన కర్మలు చేస్తూ, జాగ్రదావస్థలో ఉండే వ్యక్తి... దుఃఖాలన్నిటినీ నాశనం చేసేది యోగమేనని తెలుసుకుంటాడని పేర్కొన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం... ‘యోగ’ లేదా ఆధ్యాత్మిక మార్గం ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం, పని చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యడం, నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం, పని అవసరమైనప్పుడు వివిధ పనులు చేయడం అంతటి సరళమైనది.
ఒక శిశువుకు వయోధికులకన్నా ఎక్కువ నిద్ర కావాలి. మన ఆహారపు అవసరాలు రోజులో మనం చేసే శారీరక శ్రమ మీద ఆధారపడి ఉండొచ్చు. ‘యుక్తమైన’ అనే మాట... ‘ఆ క్షణంలో తెలుసుకోదగినది’ అనే అర్థాన్ని సూచిస్తుంది. భగవద్గీతలో అంతకుముందు పరిమిత చర్య, నిర్దేశిత విధులు లేదా తప్పనిసరి చర్యలుగా వీటి గురించి శ్రీకృష్ణుడు ప్రస్తావించాడు. దీనికి విరుద్ధంగా, మన మనస్సులు సాధారణ వాస్తవాలను సాగదీస్తూ, వాటి చుట్టూ సంక్లిష్టమైన కథనాలను అల్లడం కోసం మన ఊహలను జోడిస్తాయి. మనకు మనం చెప్పుకొనే ఈ కథలు వేరొకరిని కథానాయకులుగానో, ప్రతి నాయకులుగానో చేస్తాయి, పరిస్థితులను ఆహ్లాదకరంగానో, దుర్భరంగానో మారుస్తాయి. ఈ కథలే మన మాటలను, ప్రవర్తనను శాసిస్తాయి.
అందుకే అన్ని కోరికలతో అనుబంధాన్ని వదిలిపెట్టి, ఈ కథలను చెప్పే మనసును లొంగ దీసుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. గాలి లేని ప్రదేశంలో కంపించకుండా ఉన్న దీపం మాదిరిగా... ఆత్మతో ఐక్యతను అభ్యాసం చేస్తున్న, నిగ్రహంతో ఉన్న యోగి మనసు చలించదని ఆయన స్పష్టం చేశాడు. శ్రీకృష్ణుడు ఇంతకు ముందు తాబేలు, నదులు, సముద్రం లాంటి ఉదాహరణలు ఇచ్చాడు. నదులు సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత వాటి ఉనికిని కోల్పోతాయి, అనేక నదులు ప్రవేశించిన తనతో తర్వాత కూడా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా, సముద్రంలా స్థిరంగా ఉన్న యోగి మనస్సులో కోరికలు ప్రవేశించినప్పుడు... అవి వాటి ఉనికిని కోల్పోతాయి.
https://www.andhrajyothy.com/2025/navya/bhagavad-gitas-wisdom-on-karma-yoga-1376126.html