
అనాది కాలం నుంచి వేరువేరు నాగరికతలు, సంస్కృతులు విభిన్న కర్మలకు నిర్వచనాలు ఇచ్చాయి. కొన్నిటిని పాపాలుగా పేర్కొన్నాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూ వచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమవైన శిక్షాస్మృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలుగా లేదా పాపాలుగా నిర్వచిస్తాయి. ఆ పనులకు పాల్పడినవారిని శిక్షిస్తాయి. అటువంటి నిషేధితమైన కర్మలను మనం చేసినప్పుడు అపరాధభావం, పశ్చాత్తాపం, అవమానభారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాం. ‘వికర్మ’ లేదా ‘నిషిద్ధ కర్మ’, ‘పాపం’ అంటే ఏమిటి? అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో పడ్డాడు. యుద్ధంలో తన బంధువులను చంపడం ద్వారా ‘పాపం మాత్రమే కలుగుతుందని భావించాడు.
ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ‘‘అంతఃకరణను, శరీర ఇంద్రియాలను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన యోగి కేవలం శరీర కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు. అతనికి పాపాలు అంటవు’’ అని చెప్పాడు. ‘‘జయాపజయాలను, లాభనష్టాలను, సుఖఃదుఖాలను సమానంగా భావించి, యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు నీకు పాపాలు అంటనే అంటవు’’ అని అంతకుముందు స్పష్టం చేశాడు. ‘ఏది పాపం?’ అనే ఆలోచన చేసేటప్పుడు అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే... భౌతిక ప్రపంచంలో మనం చేసే కర్మల ఆధారంగా మనం దాన్ని అంచనా వేస్తాం. కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో ఇది ‘అంతర్గతమైన’ విషయం.
మనం ఏది చెబుతున్నాం, ఏది చేస్తున్నాం అనేది మన మానసిక స్థితి తాలూకు పరిణామం. అందుకనే మానసిక స్థాయిలో అవగాహన పొందడం అవసరమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇలాంటి ఆలోచనలు తాత్త్విక స్థాయిలో మనలో అనేక సందేహాలను లేవెనత్తుతుంది, కానీ అనుభవ స్థాయిలో మనకు స్పష్టత వస్తుంది. ‘‘ఏదైనా దొరికినప్పుడు... దాన్ని కోరుకోకపోయినా సరే, దానితో సంతుష్టి పడి, ద్వంద్వాతీతంగా ఉంటూ, అసూయ నుంచి విముక్తి పొంది, అన్నిటిపట్లా సమాన దృష్టి కలిగిన వ్యక్తి... కర్మలను చేసినా వాటి బంధాల్లో చిక్కుకోడు’’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ వివరణను వివిధ సందర్భాల్లో ఎన్నో బోధనలు కలిగి ఉన్న భగవద్గీతకు సూక్ష్మరూపం అని చెప్పవచ్చు. ద్వంద్వాతీత స్థితిని పొందాలని, ప్రతిదాన్నీ విభజించే తత్త్వం ఉన్న మనస్సును కేవలం శరీర పోషణకు అవసరమైన ఆలోచనా చర్యలకు మాత్రమే ఉపయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు.
కె. శివప్రసాద్
ఐఎఎస్
https://www.andhrajyothy.com/2025/navya/the-evolution-of-sin-across-civilizations-1373570.html