Gita Acharan |Telugu

‘‘ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఎవరో బలవంతం చేసినట్టు... దేని ప్రభావానికి ప్రేరేపితుడై పాపాలు చేస్తూ ఉంటాడు?’’ అని అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘రజోగుణం నుంచి ఉత్పన్నం అయ్యేదే కామం. అదే క్రోధంగా రూపుదాల్చుతుంది. అది భోగానుభవాలతో చల్లారేది కాదు. పైగా అంతులేని పాపకర్మలు చేయడానికి ప్రేరేపించేది కూడా అదే. కాబట్టి దాన్ని పరమ శత్రువుగా భావించాలి’’ అని చెప్పాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ‘కామం’ అనే పదాన్ని ఉపయోగించాడు. కామం అంటే కోరిక తాలూకు తీవ్ర రూపం. కర్మతో అనుబంధం కలిగి ఉండడం అనేది రజో గుణానికి ముఖ్య లక్షణం.

కామం అంటే మన జీవితాల్లో సమతుల్యత కోల్పోవడం. మనం సుఖాన్ని పొందడానికి, ఏదైనా వస్తువును సొంతం చేసుకోవడానికి, ఎవరైనా వ్యక్తితో కలిసి ఉండడానికి, అధికారాన్ని, కీర్తిని పొందడానికి చాలా శక్తిని ఖర్చు చేస్తాం. ఈ కోరికలకు శక్తిని అందిస్తున్నప్పుడు... వాటి పర్యవసానాల గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండదు. కోరికలు హద్దులు దాటినప్పుడు... వాటి మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. నెరవేరని కోరిక వల్ల క్రోధం ఏర్పడుతుంది. అదే విధంగా... ప్రతి సుఖం వెనుకా ఒక దుఃఖం ఎల్లప్పుడూ దాగి ఉంటుంది. అలా వచ్చే దుఃఖమే క్రోధంగా వ్యక్తమవుతుంది. కోరికలు ఎన్నటికీ సంతృప్తి చెందవు. వాటిని సంతృప్తి పరచడానికి ఎంత ప్రయత్నిస్తే ఎంతగా పెరుగుతూ ఉంటాయి. ధనవంతుడు మరిన్ని సంపదలను కోరుకుంటాడు. శక్తిమంతుడు నిరంకుశమైన శక్తిని కోరుకుంటాడు. వాటిని అణచివేయడం లేదా సంతృప్త్తిపరచడం అనేవి దీనికి పరిష్కారం కాదు. మనం కామం లేదా భయం అనే కోరల్లో చిక్కుకుపోయినప్పుడు... వాటి పట్ల మరింత అవగాహన పెంచుకోవాలనీ, ఆ అవగాహనే వాటి పట్టు నుంచి మనల్ని విడిపిస్తుందని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.

https://www.andhrajyothy.com/2024/navya/the-arch-enemy-of-humans-1326317.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!