Gita Acharan |Telugu

స్వధర్మం, పరధర్మం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు వివరిస్తూ... పరమాత్మలో ఐక్యం కావాలంటే అన్ని ధర్మాలనూ వదులుకోవాలని బోధించాడు. యుద్ధంలో పోరాడి, తన బంధువులను చంపితే తన ప్రతిష్ట దెబ్బతింటుందన్న అహంకారంతో నిండిన భయం, దాని నుంచి వైరాగ్యం అర్జునుడిలో ఏర్పడ్డాయి. వాటిని తొలగించి, అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చెయ్యడానికి ‘గీత’ను బోధించిన శ్రీకృష్ణుడు ‘‘యుద్ధానికి దూరంగా ఉన్నా నీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎందుకంటే యుద్ధం నీ స్వధర్మం. యుద్ధానికి దిగడానికి అర్జునుడు భయపడుతున్నాడని లోకం అనుకుంటుంది. క్షత్రియుడికి యుద్ధభయం మరణం కన్నా ఘోరం’’ అని స్పష్టం చేశాడు. ‘‘స్వధర్మం లోపభూయిష్టమైనా, యోగ్యత లేనిదైనా... పరధర్మం కన్నా ఎంతో ఉత్తమం. భయపడి అనుసరించే పరధర్మ మార్గంలో కలిగే మరణం కన్నా స్వధర్మ మార్గంలో మరణం ఎంతో ఉత్తమమైనది’’ అని చెప్పాడు. 

 

ఇతరులతో మనల్ని  పోల్చుకోవడం నుంచి, మనం పుట్టిన ప్రదేశం, కుటుంబాల ప్రతిష్ట నుంచి, చదువులో గ్రేడ్ల నుంచి, ఉద్యోగంలో లేదా వృత్తిలో మంచి సంపాదన నుంచి, మన జీవితంలో సంపాదించుకొనే అధికారం, పేరు ప్రతిష్టల నుంచి ‘స్వీయ విలువ’ అనే భావన ఏర్పడుతుంది. కానీ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారేననీ, తమతమ స్వధర్మం ప్రకారం విశిష్టంగా వికసిస్తారనీ కృష్ణుడు చెప్పాడు. అన్నిటిలో అవ్యక్తమయ్యేది ఒకటే అయినప్పటికీ, వ్యక్తమైన ప్రతిదానికీ ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుందన్నాడు. చివరగా, అన్ని ధర్మాలనూ విడిచిపెట్టి, తనను ఆశ్రయించాలని సూచించాడు. అలా చేసినప్పుడే మానవులు సమస్త పాపాల నుంచీ విముక్తులు కాగలరని తెలిపాడు. ఇది ‘భక్తియోగం’ పేర్కొన్న శరణాగతిని పోలి ఉంటుంది. ఆధ్యాత్మికత పునాదుల్లో అదొకటి. నది సముద్రంలో ఒక భాగం అయినప్పుడు తన స్వధర్మాన్ని కోల్పోతున్నట్టు... పరమాత్మతో ఐక్యం కావాలంటే మనం కూడా మన అహంకారాన్నీ, స్వధర్మాన్నీ కోల్పోవాలి


Contact Us

Loading
Your message has been sent. Thank you!