
‘సుఖ దుఃఖే సమకృత్వా’ అనే శ్లోకంలో... సుఖ దుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు సూచించాడు. సమత్వానికి ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ తరువాత ‘‘అయుక్తుడికి అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఆత్మ విషయకమైన బుద్ధి, ఆత్మ స్వరూపం తాలూకు భావన.. ఈ రెండూ కలగవు. ఫలితంగా అతనికి శాంతి ఉండదు. శాంతి లేనివారికి సంతోషం ఉండదు’’ అని ‘నాస్తి బుద్ధి రయుక్తశ్య’ అనే శ్లోకం ద్వారా బోధించాడు. దీనిలో సమత్వానికి సంబంధించిన మరో దృష్టి కోణం ఉంది. మనుషులు తమలో తమను స్థిరపరచుకొనేవరకూ... అంటే ఆత్మ వివేచన పొందేవరకూ... స్నేహితులు, శత్రువులు, ఉద్యోగం, జీవిత భాగస్వామి, పిల్లలు, డబ్బు, ఆనందం, అధికారం ఆస్తులు అనే వాటి మీద తమ మనుగడ కోసం ఆధారపడతారు. దృష్టి డబ్బు మీద కేంద్రీకృతం అయినవారి ప్రణాళికలన్నీ సంపదను పెంచుకోవడం చుట్టూ తిరుగుతాయి. దానికోసం ఆరోగ్యం, అనుబంధాలు లాంటి అన్ని విషయాలనూ పణంగా పెడతారు. సుఖమే ప్రధానం అనుకున్నవారు ఆ సుఖాన్ని పొందడం కోసం ఇతరులను మోసం చేయడానికి వెనుకాడరు. శత్రుత్వమే ప్రధానంగా భావించేవారు తమ శత్రువులను ఎలా దెబ్బ తీయాలా? అని ఆలోచిస్తారు. మనం ఇతరులతో ముడిపడి ఉన్నప్పుడు... మన శాంతి వారి చేతుల్లో ఉంటుంది. మనల్ని వారి మీద ఆధారపడేలా చేస్తుంది. అందుకే మనం మధ్యలో కేంద్రీకృతమై ఉండే సమస్థితి గురించి శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. ఆ స్థితే మోక్షం.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపయోగించిన ‘భావం’ అనే పదాన్ని మనం భావోద్వేగాలతో ముడిపెట్టి అర్థం చేసుకోవడడానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు ‘నా’ లేదా ‘నేను’తో ముడిపడి ఉన్నప్పుడు... లోతైన భావోద్వేగాలు ప్రేరేపితమవుతాయి. లేదంటే కొన్నిసార్లు అవి మన హృదయాన్ని తాకనుకూడా తాకకపోవచ్చు. మన భావోద్వేగాలన్నీ వ్యక్తిపరమైనవని ఇది సూచిస్తుంది. అయితే శ్రీకృష్ణుడు చెబుతున్నది... సమానత్వం నుంచి ఉద్భవించే ‘భావం’ గురించి.. అది ‘నేను’ అనే భావనతో సంబంధం కలిగి ఉన్నా, లేకున్నా ఒకటిగానే ఉంటుంది. మన పరిసరాలు అప్రియంగా, అస్తవ్యస్తంగా, కలవరపెట్టేవిగా ఉండవచ్చు. కానీ తటస్థంగా ఉండడం ద్వారా అంతర్గత సామరస్యాన్ని పొందిన వ్యక్తిని అవి ప్రభావితం చేయలేవు. శ్రీకృష్ణుడు దాన్నే ‘శాంతిని పొందడం’ అని సూచించాడు. అది అంతిమంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది.
ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఆత్మ విషయకమైన బుద్ధి, ఆత్మ స్వరూపం తాలూకు భావన కలగవు. ఫలితంగా అతనికి శాంతి ఉండదు. శాంతి లేనివారికి సంతోషం ఉండదు’’ అని ‘నాస్తి బుద్ధి రయుక్తశ్య’ అనే శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు బోధించాడు.
https://www.andhrajyothy.com/2024/navya/peace-of-mind-with-neutrality-1291037.html