Gita Acharan |Telugu

అహంకారం (‘నేనే కర్తను’ అనే భావన) అర్జునుణ్ణి ఆవహించిందనీ, అదే అతని విషాదానికి కారణమనీ శ్రీకృష్ణుడు గమనించాడు. అర్జునుడి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికీ, అంతరాత్మదాకా చేరుకోవడానికీ సమగ్ర బుద్ధిని ఉపయోగించాలని సలహా ఇచ్చాడు. అహంకారానికి అనేక రూపాలు ఉన్నాయి. గర్వం అహంకారంలో ఒక చిన్న భాగం. ఎవరైనా విజయం/గెలుపు/లాభం అనే ధ్రువాలలోంచీ వెళుతున్నప్పుడు.... ఆ అహంకారాన్ని అభిమానం అంటారు. ఎవరైనా నష్టం/వైఫల్యం/ఓటమి అనే బాధాకరమైన ధ్రువాలలోంచీ వెళుతున్నప్పుడు... ఆ అహంకారాన్ని నిరాశ/దుఃఖం/క్రోధం అంటారు. ఇతరులు ‘సుఖం’ అనే ధ్రువంలోంచి వెళుతున్నప్పుడు... మనలోని అహంకారం అసూయగా మారుతుంది. ఎవరైనా ‘దుఃఖం’ అనే ధ్రువంలో ఉంటే... అప్పుడది మనలో సానుభూతిని కలిగిస్తుంది. మనం భౌతిక ఆస్తులను కూడబెడుతున్నప్పుడు, వాటిని పోగొట్టుకున్నప్పుడు కూడా ఇది ఉంటుంది. ఇది లోకంలో కర్మ చెయ్యడానికీ లేదా సన్యాసం స్వీకరించడానికీ ప్రేరేపిస్తుంది. సృష్టితో పాటు వినాశనానికి కూడా ఇదే కారణం. ఇది జ్ఞానంలోనూ ఉంది, అజ్ఞానంలోనూ ఉంది.

 

 

ప్రశంసలు అహంకారాన్ని పెంచుతాయి. విమర్శలు బాధ పెడతాయి. ఈ రెండు దశలూ మన భావాల్ని ఇతరులు తారుమారు చేయడానికి అనుకూలంగా మారుస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే... ప్రతి భావోద్వేగం వెనుకా ఏదో రూపంలో అహంకారం ఉంటుంది. ఈ భావోద్వేగాలు మన బాహ్య ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అహంకారం మనల్ని విజయం వైపు, శ్రేయస్సు వైపు నడిపిస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ అది తాత్కాలిక తృప్తి కోసం మాదక ద్రవ్యాలను తీసుకోవడం లాంటిది. ‘నేను’, ‘నాది’, ‘నన్ను’, ‘నాకు’ అనేవి అహంకారానికి కాళ్ళలాంటివి. రోజువారీ సంభాషణలు, ఆలోచనల్లో ఈ పదాలను ఉపయోగించకుండా ఉండడం ద్వారా... అహంకారాన్ని చాలావరకూ బలహీనపరచవచ్చు. మనల్ని మనం ఒక ధ్రువ లక్షణంతో లేదా మరోదానితో గుర్తించాలని కోరుకున్నప్పుడు... అహంకారం పుడుతుంది. అందుకే అహంకారానికి చోటివ్వని నిర్వికల్ప స్థితిలో... సమత్వ భావాన్ని కలిగి ఉండాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు సూచించాడు.

https://www.andhrajyothy.com/2024/navya/pride-different-dimensions-1277517.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!