యోగం అంటే మన లోపలి, వెలుపలి భాగాల కలయిక. కర్మ, భక్తి, సాంఖ్య, బుద్ధి తదితర అనేక మార్గాల ద్వారా దీన్ని పొందవచ్చు. వ్యక్తులు తమతమ స్వభావాన్ని బట్టి... తమకు తగిన మార్గాల ద్వారా యోగాన్ని పొందుతారు. ఈ సమత్వ బుద్ధి యోగం కన్నా సకామకర్మ చాలా తక్కువ స్థాయికి చెందినది. కాబట్టి... ‘‘నీవు సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించు. ఎందుకంటే ఫలాసక్తితో కర్మలు చేసేవారు అత్యంత దీనులు’’ అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతకుముందు కర్మయోగంలో ఉన్నవారి బుద్ధి పొందికగా ఉంటుందనీ, అస్థిరమైన వారి బుద్ధి నిలకడ లేకుండా ఉంటుందనీ కూడా అన్నాడు. ఒకసారి బుద్ధి సమగ్రత సాధిస్తే... భూతద్దం కాంతిని కేంద్రీకృతం చేసినట్టు... అది జ్ఞానోపాసనలో కేంద్రీకృతమై సమర్థతను పొందుతుంది. సరైన దిశ, గమనం కలిగి ఉంటుంది.
ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రస్తావించింది... అంతరంగం వైపు ప్రయాణం గురించి. సాధారణంగా మనం బాహ్య (భౌతిక) ప్రపంచంలో కోరికలను నెరవేర్చుకోవడానికి తెలివిని ఉపయోగిస్తాం. అయితే మనం అంతరంగం వైపు ప్రయాణాన్ని కొనసాగించడానికి దాన్ని ఉపయోగించాలని భగవద్గీత బోధిస్తోంది.
మనలో పాతుకుపోయిన నమ్మకాలు, భావోద్వేగాలు, ఊహలు, ఆలోచనలు, చర్యలు, మనం మాట్లాడే పదాలు... ఇలా ప్రతిదాన్నీ ప్రశ్నించాలి. అంతర్గత ప్రయాణం కోసం పొందికైన మేధస్సును ఉపయోగించడంలో అదే మొదటి అడుగు. జ్ఞానం సరిహద్దులను దాటడానికి ప్రశ్నించడాన్ని విజ్ఞానశాస్త్రం ఉపయోగించినట్టు... మనం కూడా ఇటువంటి ప్రశ్నలను మనలోని పరమ సత్యాన్ని వెలికి తీయడానికి ఉపయోగించవచ్చు. చేసిన కర్మ తాలూకు ఫలాలను పొందాలనే ఆలోచనతో ఉన్నవారు దుఃఖితులని శ్రీకృష్ణుడు చెప్పాడు. కొన్నిసార్లు కర్మ ఫలాలు మనకు సుఖాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఈ ధోరణిని పెంపొందించుకుంటాం.
కానీ ధ్రువీకృత ప్రపంచంలో ప్రతి సుఖం కాలక్రమేణా బాధగా మారుతుంది. అది మన జీవితాలను నరకం చేస్తుంది అనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు మనలోని వైరుధ్యాల నుంచి మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేయలేదు. కానీ ఆత్మతత్త్వాన్ని గ్రహించి వాటిని అధిగమించమని చెప్పాడు.
కె. శివప్రసాద్
ఐఎఎస్
https://www.andhrajyothy.com/2024/navya/integral-intelligence-gitasaram-1274125.html