Gita Acharan |Telugu

భగవద్గీత సారాంశం మొత్తం ‘సుఖదుఃఖే సమేకృత్వా, లాభాలాభౌ జయాజయౌ...’ అనే శ్లోకంలో ఇమిడి ఉంది. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయాపజయాలను సమానంగా భావించినప్పుడు... యుద్ధం చేసినా పాపం అంటదని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ సమత్వాన్ని ఆ యుద్ధ సందర్భానికే కాకుండా... ఇతర కర్మల విషయంలోనూ అన్వయించుకోవచ్చు. మన కర్మలన్నీ ప్రేరేపితమైనవనీ, ఈ ప్రేరణ ఆ కర్మలను అపవిత్రం లేదా పాపమయం చేస్తుందనీ ఈ శ్లోకం చెబుతుంది. కానీ సుఖం, లాభం, విజయం లాంటి వాటి నుంచి ప్రేరణ పొందకుండా... కర్మను ఎలా చేయాలో మనకు తెలీదు. అలాగే మనం చేసే కర్మలన్నీ దుఃఖం, నష్టం లేదా అపజయాన్ని తప్పించుకోవడానికి చేసేవే.

సాంఖ్య, కర్మయోగాల దృక్కోణం నుంచి గమనిస్తే... ప్రతి కర్మను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: కర్త, కర్మ, కర్మఫలం. శ్రీకృష్ణుడు కర్మఫలాన్ని సుఖం-దుఃఖం, లాభం-నష్టం, విజయం-అపజయంగా వర్గీకరించాడు. సంతులనం సాధించడానికి ఈ మూడిటినీ వేరు చేయాలని ఆయన ఉపదేశించాడు. దీనికి ఒక మార్గం ఏమిటంటే... ‘నేనే కర్తను’ అనే భావనను విడనాడి, కేవలం సాక్షిని మాత్రమే అనే అవగాహన కల్పించుకోవడం. జీవితం అనే జగన్నాటకంలో మనం పోషించే పాత్ర గణనీయం కాదనే అవగాహన కలగాలి. ఇక మరోమార్గం... కర్మఫలాలపై మనకు ఎటువంటి హక్కు లేదని గుర్తించడం. అంటే కర్మఫలం అనేది మన ప్రయత్నాలతో పాటు ఇతర అనేక కారణాల సమ్మేళనం అని గుర్తించడం. కర్తృత్వాన్ని విడనాడడం, కర్మ ఫలాన్ని విడనాడడం అనే రెండిటి మార్గాలూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒకదానిలో ప్రగతి సాధిస్తే... రెండోదానిలో ప్రగతి దానంతట అదే వస్తుంది.

ఆ శ్లోకాన్ని భక్తియోగ కోణం నుంచి కూడా చూడవచ్చు. భక్తి యోగంలో భావమే సర్వస్వంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు కర్మకన్నా భావానికే ప్రాధాన్యత ఇచ్చాడు. దానివల్ల అంతర్గత శరణాగతి, సమదృష్టి వాటంతట అవే కలుగుతాయి. తమతమ దృక్పథాలను బట్టి ఎవరికివారు తమ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ శ్లోక సారాన్ని అవగాహన చేసుకోగలిగితే... అహంకారం నుంచి విముక్తి పొంది అంతరాత్మను చేరుకోగలరు.

-కె .శివ ప్రసాద్

ఐఏఎస్

 

https://www.andhrajyothy.com/2024/navya/to-achieve-balance-1261752.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!