Gita Acharan |Telugu

మన సమాజంలో ఉన్న చట్టాలు బయటి ప్రపంచంలో క్రమానుగతమైన వ్యవస్థను నిలబెట్టడం కోసమైతే... భగవద్గీత మన ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని, సద్భావనను నిలబెట్టుకోవడం కోసం. మనం చేసే ఏ కర్మకయినా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఉద్దేశం, రెండోది అమలు చేయడం. చట్ట పరిభాషలో వీటిని ‘మెన్స్‌ రియా అండ్‌ ఆక్టస్‌ రియస్‌’ అని (లాటిన్‌ పదాల్లో) పేర్కొంటారు. ఉదాహరణకు... ఒక సర్జన్‌, ఒక హంతకుడు ఇద్దరూ కత్తిని ఉపయోగిస్తారు. సర్జన్‌ ఉద్దేశం కాపాడడం, చికిత్స చేయడం. హంతకుడి ఉద్దేశం హాని చేయడం, చంపడం. రెండు సందర్భాలలోనూ మరణం సంభవించవచ్చు. కానీ ఉద్దేశాలు మాత్రం ఒకదానికి ఒకటి పూర్తిగా విరుద్ధమైనవి.

 

 

చట్టం పరిస్థితులను బట్టి మారుతుంది. కానీ భగవద్గీత ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది. రోడ్డుకు ఎడమవైపు వాహనం నడపడం ఒక దేశంలో చట్టబద్ధమైతే, మరో దేశంలో దాన్ని నేరంగా పరిగణించవచ్చు. చట్టం పనులను... ‘మంచి పని, చెడ్డ పని’ అంటూ విభజిస్తుంది. కానీ జీవితంలో అనేక సందేహాస్పదమైన పరిస్థితులు ఉంటాయి. మనం పన్నులు కడుతున్నంత వరకూ అది ఇష్టంతో కట్టారా? కష్టంతో కట్టారా? అనే దానితో చట్టానికి సంబంధం లేదు. మనం ఉంటున్న ప్రాంతంలోని చట్టం ప్రకారం... అది నిర్వచించే పరిమితుల్లో మనం ఉన్నంత వరకూ చట్టం మన జోలికి రాదు. ఎవరైనా ఒక నేరం చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్టయితే దానికి చట్టం అడ్డు రాదు. నేరం చేసిన తరువాత మాత్రమే అది రంగంలోకి దిగుతుంది. కానీ అటువంటి ఆలోచనలను కూడా నిర్మూలించాలని భగవద్గీత చెబుతుంది. ‘మొక్కై వంగనిది మానై వంగదు’ అన్నట్టు ‘ఉద్దేశం దశలో ఉన్న (చేయాలనుకుంటున్న) కర్మ గురించి అవగాహన ఉండాలి. లేకపోతే అది మన నియంత్రణను దాటిపోతుంది’ అని భగవద్గీత బోధిస్తుంది. ఆ ఉద్దేశాన్ని అమలు చేయడం అనేది భవిష్యత్తులో జరిగే పని. ఉద్దేశం దశలోనే దాన్ని ఆపకపోతే... ఆ తరువాత దాని మీద మనకు ఎటువంటి నియంత్రణా ఉండదు. ఉద్దేశాలను అధిగమించి ఎదగడానికి భగవద్గీత మనకు సాయపడుతుంది. ఉద్దేశం మంచిదయినా, చెడ్డదయినా... అది విజయంతో లేదా అపజయంతో కలిసినపుప్పుడు అహంకారమైనా పెరుగుతుంది లేదా బలహీనమైన క్షణంలో లావాలా పెల్లుబికే నిరాశ, నిస్పృహ మనసులో పేరుకుంటాయి. ఈ రెండు రకాల పరిస్థితులు మనల్ని మన అంతరాత్మ నుంచి దూరం చేస్తాయి. మన ఉద్దేశాలను గమనించి, వాటిపై అవగాహనను పెంచుకోవాలలి. అప్పుడే వాటిని అధిగమించి... అంతరాత్మను చేరుకోగలుగుతాం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!