Gita Acharan |Telugu

‘‘పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నా, స్వధర్మంలో అంతగా సుగుణాలు లేకపోయినా... చక్కగా అనుష్టించే ఆ పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణించడం శ్రేయస్కరం. పరధర్మాచరణం భయంకరమైనది’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. క్లిష్టంగా అనిపించే ఈ బోధన మన మనసుల్లో స్పష్టత కన్నా సందేహాలనే ఎక్కువగా సృష్టించే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే... ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితికి సందర్భోచితమైనది. అర్జునుడిలో ఆ క్షణం వరకూ యోధుల ధర్మమే ఉంది. ఆ మరుసటి క్షణంలో సన్యాసి కావాలని కోరుకున్నాడు. అలా మారే అవకాశం లేదు కాబట్టి శ్రీకృష్ణుడు పరధర్మ, స్వధర్మాల ఉచితానుచితాల గురించి చెప్పాడు.

ధర్మం ఒక్కటే. కానీ దాన్ని మనం అనేక విధాలుగా చూస్తాం. అయిదుగురు అంధులు, ఒక ఏనుగు అనే కథ ఉంది. వారు తమ స్పర్శ ద్వారా ఏనుగు గురించి విభిన్నంగా ఎలా భావించారో... ధర్మం గురించి పాక్షికమైన అవగాహన కూడా అలాగే ఉంటుంది. వారిలో ఏనుగును దంతంగా భావిస్తే... అది అతని వాస్తవికత లేదా స్వధర్మం. ఏనుగును కాలుగా, తోకగానో భావించే వ్యక్తులు వర్ణించిన దాన్ని బట్టి... ఆ అభిప్రాయాలను స్వీకరించడానికి మొదటి వ్యక్తి ప్రయత్నించకూడదనీ, తనదైన మార్గాన్ని అనుసరించాలని ఈ శ్లోకం సూచిస్తోంది. వీరిలో ఎవరి అభిప్రాయం సరైనదనేది తదుపరి ప్రశ్న. ఏనుగు శరీరాన్ని తడిమిన ప్రతి ఒక్కరి దృష్టిలో... వాళ్ళు వ్యక్తపరచిన అభిప్రాయం వాస్తవమే. అందుకే గుణరహితమైనా స్వధర్మాన్నే అనుసరించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇతరుల ధర్మాలతో పోలికను ప్రోత్సహించలేదు.

ధర్మాన్ని మన ఇళ్ళలో వినియోగించే విద్యుతతో పోల్చవచ్చు. అది దాన్ని ఉపయోగించే ఉపకరణాన్నిబట్టి విభిన్నంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి పరికరం తనదైన సొంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ‘‘నేను టెలివిజన అవ్వాలి’’ అని ఫ్యాన కలలు కన్నా అవి నిజం కావు కదా! అణచివేత మనల్ని ఏ గమ్యానికీ చేర్చదని అంతకుముందే శ్రీకృష్ణుడు సూచించాడు. పరధర్మాన్ని స్వీకరించడం అంటే స్వధర్మాన్ని అణచివేయడం. అణచివేత విభజనకు దారి తీస్తుంది. అంధులు, ఏనుగు కథ మాదిరిగానే వాస్తవికత అనేది అనేక వ్యక్తిగత అవగాహనల సారం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!