Gita Acharan |Telugu

‘‘ప్రకృతి మాయ వల్ల పుట్టిన త్రిగుణాల ప్రభావానికి లోనైన మనుషులు ఆ గుణాల పట్ల, కర్మల పట్లా ఆసక్తి చూపిస్తారు. పూర్తిగా తెలిసినవారు, జ్ఞానులైనవారు అలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన, మందబుద్ధులైన అజ్ఞానులను ఊగిసలాటకు గురి చేయకూడదు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. సత్త్వ, రజో, తమో గుణాలే మనం చేసే కర్మలకు కర్తలు. అంతేకాకుండా మన నిజమైన స్వభావాన్ని మరచిపోయేలా చేసి, మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే సామర్థ్యం ఆ గుణాలకు ఉంది. వాటి మాయ ఆధీనంలో మనం ఉన్నామని గ్రహించేవరకూ మనం అలా మంత్రముగ్ధులమయ్యే ఉంటాం. అజ్ఞానులు ఈ గుణాల మంత్రముగ్ధతలో ఉండి, తామే కర్తలమని భావిస్తారు. ఏదో సాధించాలనీ, గొప్పవారిగా ఉండాలనీ, సమాజంలో గుర్తింపు పొందాలనీ, అధికారం కావాలనీ కోరుకుంటారు. అదే సమయంలో వారు కుటుంబాన్నీ, కార్యాలయాన్నీ, సమాజంలోని ఇతరులనూ కూడా కర్తలుగా భావిస్తారు. అందరూ తమ అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించాలనీ, లేదా పని చేయాలనీ ఆశిస్తారు. ఈ పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే విజయాలు, వైఫల్యాలు ఎప్పుడూ ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. దాని మూలంగా అపరాధ భావం, పశ్చాత్తాపం, కోపం, కష్టం లాంటి వాటికి లోనవుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం రెండో దశలో... ఒక ఘటన జరిగిన కొంత కాలం తరువాత అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన కొన్ని క్షణాలు, సంవత్సరాలు, దశాబ్దాలు లేదా జీవితకాలం తరువాత రావచ్చు. మనం మాట్లాడే మాటలు, తీసుకొనే నిర్ణయాలు లేదా మనం చేసే కర్మలు... ఈ సంఘటనల్నీ మన మీద గుణాల ప్రభావం వల్ల జరిగేవేనని గమనించాల్సి ఉంటుంది.

ఆఖరి దశలో, వర్తమాన క్షణంలోనే మనం కర్తలం సాదనీ, వాస్తవంగా కర్మలన్నీ ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయనీ గ్రహిస్తాం. మన కర్మలకి మనం సాక్షిగా ఉండగలిగే స్థితి ఇది. అజ్ఞాని కూడా కాలక్రమేణా తన స్వధర్మం ప్రకారం ఈ అవగాహన స్థితికి చేరుకుంటాడు. కాబట్టి అజ్ఞానులకు భంగం కలిగించకుండా వేచి ఉండాలని జ్ఞానులకు శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నాడు. మనం అందరం మనం జీవిస్తున్న ఈ ప్రపంచం గురించి అనేక అపోహలనూ, మూఢనమ్మకాలనూ కలిగి ఉంటాం. అజ్ఞానులు వాటిలో ఖైదీలై ఉంటారు. వీటన్నిటినీ అధిగమించడమే మోక్షం.

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!