Gita Acharan |Telugu

ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు. కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు తదితరాలను నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యంతో... పిల్లలకు ఉదాహరణగా నిలుస్తూ ఉండాలి. అదే పిల్లల పెంపకంలో ఉత్తమమైన మార్గం. ఆ తరువాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సలహాదారులు తదితరుల మీద పిల్లలు ఆధారపడడం కొనసాగుతుంది. అదేవిధంగా మన మీద ఆధారపడే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం మనవైపు చూసే వ్యక్తులు ఉంటారు. మనం ఏది చేసినా అది వారి మీద ప్రభావం చూపిస్తుంది. ‘‘శ్రేష్టుడైన వ్యక్తి ఆచరణనే (ప్రవర్తననే) ఇతరులు అనుసరిస్తారు. అతడు నిలిపిన (ప్రతిష్ఠించిన) ప్రమాణాలనే లోకులు పాటిస్తారు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

 

‘‘అర్జునా! ఈ ముల్లోకాలలో నాకు కర్తవ్యం అనేది ఏదీ లేదు. అలాగే పొందగలిన వస్తువులలో నేను పొందనిదంటూ ఏదీ లేదు. అయినప్పటికీ, నేను కర్మలలోనే ప్రవర్తిల్లుతున్నాను. ఓ పార్థా! ఎప్పుడైనా నేను సావధానుడినై, కర్మలలో ప్రవర్తించకపోతే... లోకానికి గొప్ప హాని సంభవిస్తుంది. ఎందుకంటే... మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తారు. నేను కర్మల్ని ఆచరించడం మానేస్తే ఈ లోకాలన్నీ నశిస్తాయి. అంతేకాదు, లోకాల్లో అల్లకల్లోలం చెలరేగుతుంది. ప్రజా నష్టం వాటిల్లుతుంది. అప్పుడు దానికంతటికీ నేనే కారకుణ్ణి అవుతాను’’ అని శ్రీకృష్ణుడు తెలిపాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ స్థాయి నుంచి ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. సృష్టి, నిర్వహణ, విధ్వంసంతో కూడిన సృజనాత్మక స్థాయి నుంచి బోధిస్తున్నాడు. సృజనాత్మకత అనేది తన చర్యను ఆపేస్తే సంభవించే పరిణామాల గురించి గీతా శ్లోకాలలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.

 

ఒక రైతు విత్తనాలు నాటినప్పుడు... అవి మొలకెత్తడానికి కారణం సృజనాత్మకత. ఆ సృజనాత్మకత ఆగిపోతే... విత్తనాలు వృధా అవుతాయి. మొలకెత్తిన తరువాత ఆ పంట ఎదగకపోతే... అది కూడా గందరగోళానికి కారణం అవుతుంది. పెరిగిన తరువాత పంట పండకపోతే... అది ముందు తరాలను నాశనం చేస్తుంది. శ్రీకృష్ణుడు బోధించిన విషయాలను ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ విశ్వంలో కనిపించే, కనిపించని స్వయంచాలకత్వం మీద మన జీవితాలు ఎంతో ఆధారపడి ఉన్నాయి. సృజనాత్మకత ద్వారా... అలసిపోకుండా నిరంతరం జరిగే కార్యాల మీద మాత్రమే మన జీవిత గమనం సాధ్యం అవుతుంది.


Contact Us

Loading
Your message has been sent. Thank you!