Gita Acharan |Telugu

‘‘నీవు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండడం కన్నా చెయ్యడమే ఉత్తమం. కర్మలు ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు’’ అని భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ఆహారాన్ని సేకరించడం, భోజనం చెయ్యడం లాంటి చర్యలు మానవ శరీరం మనుగడకు అవసరం. మానవ శరీరం అనేక అవయవాలు, వ్యవస్థలు, రసాయనాలను కలిగి ఉంటుంది. అవి క్రమం తప్పకుండా వేలాది అంతర్గత చర్యలను సాగిస్తూ ఉంటాయి. వాటిలో ఒక్కటి క్రమం తప్పినా... సామరస్యం దెబ్బతింటుంది. శరీరం రోగగ్రస్తమవుతుంది లేదా నశిస్తుంది. అంటే శరీర నిర్వహణ... నిష్ర్కియాత్మకంగా సాధ్యం కాదు.

 

శ్రీకృష్ణుడు ‘నియత చర్యల’ గురించి చెప్పాడు. ఇది ఒక క్లిష్టమైన తత్త్వ జ్ఞానం. మనమీద సమాజం విధించిన కట్టుబాట్లను, అలాగే పవిత్ర గ్రంథాలు ప్రస్తుతించిన ఆచారాలు లేదా విధులను సాధారణంగా నియతకార్యాలని పేర్కొంటారు. కానీ శ్రీకృష్ణుడు బోధించిన దాన్ని అటువంటి నియత కర్మలు నిర్వచించలేవు. ఒక చిన్న విత్తనం సమున్నతమైన వృక్షంగా మారుతుంది. అలాగే ఒక చిన్న కణం జన్యువులలో (జీన్స్‌లో) ఉన్న సూచనలను అమలు చేయడం ద్వారా సంక్లిష్టమైన మానవ శరీరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత సామర్థ్యాన్ని సాధించడమే మన బాధ్యత. కణాల కోసం జన్యువులు ఇచ్చే సూచనల మాదిరిగానే... మనలోని ప్రతి ఒక్కరి కర్మ... మన గుణాల (అవి ఇచ్చే సూచనల) ద్వారానే సాగుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి, ఆ సూచనలను అమలు చేస్తున్నప్పుడు ‘చేయడం’ అనేది మాత్రమే ఉంటుంది. అందులోనే మనిషి పెరగడం, తనను తాను రక్షించుకోవడం, ఇతరులకు సేవలు చేయడం లాంటివి ఉంటాయి. ‘ఏం చేస్తున్నాం’ అనే దానికి కాదు, ‘ఏ పనినైనా ఎంత బాగా చేస్తున్నాం’ అనేది ప్రధానం. ‘అన్నిటికన్నా ఉత్తమం’... అంటే సర్వశ్రేష్టం అనేది వ్యక్తికీ వ్యక్తికీ మారుతూ ఉంటుంది. అది మన భౌతిక శక్తి, అనుభవం, సమయం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కేవలం ఉనికి (ఉండడం), నిశ్శబ్దం లేదా సానుభూతితో వినడం లాంటి వాటి మీద కూడా కావచ్చు. నిజానికి ఇటువంటి కర్మలన్నీ మనల్ని శాశ్వత స్థితి అయిన మోక్షం (గుణాలను అధిగమించడం) వైపు తీసుకువెళ్తాయి. ఇదే మన నియత కార్యం. అయితే ఇదంతా ఏదైనా చేయడానికో, దేన్నయినా ఎంచుకోవడానికో సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే... మన జీవితంలో అతి పెద్ద సంఘటన అయిన పుట్టుకే మనం ఎంచుకున్నది కాదు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!