Gita Acharan |Telugu

‘‘సంతృప్తి చెందిన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి దుఃఖాలు, విచారాలు నాశనమవుతాయి’’ అనిభగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే, మన ఆలోచనలు దీనికి విరుద్ధంగా సాగుతాయి. మన కోరికలన్నీ తీరాక సంతృప్తి లభిస్తుందనీ, దుఃఖం (దీన్ని తరచుగా మనమే సృష్టించుకుంటూ ఉంటాం) నాశనమవుతుందనీ అనుకుంటాం. అయితే, మొదట సంతృప్తి చెందితే, మిగిలినవన్నీ వాటంతట అవే దాన్ని అనుసరిస్తూ వస్తాయని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.

 

ఉదాహరణకు, మనకు జ్వరం, ఒళ్ళు నొప్పులలాంటి లక్షణాలు ఉన్నప్పుడు... మన ఆరోగ్యం బాగులేదనే నిర్థారణకు వస్తాం. అయితే, లక్షణాలను అణచివేసినప్పటికీ, మనలో అంతర్లీనంగా ఉన్న అనారోగ్య స్థితికి చికిత్స చేయకపోతే ఆరోగ్యంగా ఉండలేం. మరోవైపు... పోషకాలతో కూడిన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం లాంటివి మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే విధంగా, భయం, క్రోధం, ద్వేషం... ఇవన్నీ దుఃఖంలో భాగాలు. మనలో సంతృప్తి లేదనడానికి సంకేతాలు. కానీ... కేవలం వీటిని అణచివేసినంత మాత్రాన మనకు సంతృప్తి లభించదు. ఇలాంటి సంకేతాలను అణచివేయడానికి త్వరితమైన పరిష్కారాలను బోధించడం, అభ్యాసం చేయడం జరుగుతూనే ఉంది. కానీ ఇలా అణచివేస్తున్న లక్షణాలన్నీ తరువాత మరింత బలంగా బయటకు తన్నుకొస్తాయి. ఫలితాన్ని ఆశించకుండా కర్మను ఆచరించడం, మన చర్యలకు, ఆలోచనలకు, భావాలకూ మనం సాక్షులమే తప్ప కర్తలం కాదనే అవగాహన పొందడం... అదే సంతృప్తికి మార్గం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!