Gita Acharan |Telugu

శాశ్వత నిశ్చయత అనేది పుస్తకాల ద్వారా కాకుండా, సొంత అనుభవాల ద్వారా కలుగుతుంది. భావోద్వేగాలు కలిగిన అర్జునుడి ప్రశ్నలు స్వీయ సమర్ధన కోసం వచ్చినవని శ్రీకృష్ణుడు సూచించాడు.


 

జీవితంలో మనకు ఎదురైన రకరకాల సందర్భాల్లో భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటాం. అప్పుడు మనలో అనిశ్చితి నెలకొంటుంది. భావోద్వేగానికి లోనై... సరైన సాక్ష్యాధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిర్థారణలకు రావడం, అంచనాలు వేయడం లాంటివి వదిలేయాలని శ్రీకృష్ణుడు సూచించాడు. యుద్ధంలో తన బంధువులను చంపడం వల్ల ఎలాంటి మంచి జరగదనే భావనతో అర్జునుడు యుద్ధాన్ని తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత... తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడం కోసం ‘ఏది సముచితం, ఏది కాదు?’ అనే చర్చను ముందుకు తెచ్చాడు. ‘‘అన్నిటికన్నా వివేకమే ఉన్నతమైనదిగా భావిస్తే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలోకి ఎందుకు దించావు? ప్రసంగాలతో నాకు కలవరం కలిగించవద్దు. నా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని... అన్నిటికన్నా ఏది మంచిదో నాకు నిశ్చయంగా చెప్పు’’ అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. ఈ ప్రశ్న అవగాహన కోసం, అన్వేషణ కోసం కాకుండా స్వీయ సమర్ధనకోసం వేసినట్టు కనిపిస్తుంది.

 

మన పరిస్థితి కూడా అర్జునుడికన్నా భిన్నంగా ఏమీ లేదు. ఎందుకంటే... మనం ఈ లోకంలోకి వచ్చీ రాగానే... మతం, జాతి, కులం, కుటుంబ స్థితి, జాతీయత, ఆడ-మగ మొదలైన వాటితో మనకు గుర్తింపు ఏర్పడుతుంది. వాటిని నిలబెట్టుకోవడానికి, వాటిని సమర్ధించు కోవడానికి జీవితాంతం పోరాడుతూనే ఉంటాం. అలాగే అర్జునుడు కూడా సమర్ధన కోసం నిశ్చయమైన సమాధానాన్ని శ్రీకృష్ణుడి నుంచి ఆశిస్తున్నాడు. ఈ లోకంలో ఆశాశ్వతత్వం, అనిశ్చితి అనేవి ప్రమాణాలుగా ఉంటాయి. అంటే ఏదీ శాశ్వతం కాదు, ఏదీ నిశ్చయంగా ఉండదు. కానీ మనకు హాయిని ఇచ్చే నిశ్చయత లేదా నిశ్చితి (సర్టెనిటీ) కోసం ఎదురుచూస్తాం. హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుచూపే మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి, అనిశ్చితిలోనే నిరీక్షించడానికి ధైర్యం, ఓర్పు కావాలి. శాశ్వతమైన నిశ్చయత అనేది సొంత జీవన అనుభవాల నుంచి వస్తుంది. ఇది డ్రైవింగ్‌ లేదా సైక్లింగ్‌ లాంటిది. అది ప్రతి ఒక్కరికీ వారి వారి సొంత అనుభవం. ఈ అనుభవాలను పుస్తకాల నుంచో లేదా ఇతరుల నుంచో అరువు తెచ్చుకోలేం. కాబట్టి దాన్ని మనం కష్టపడే సంపాదించుకోవాలి.

 

https://www.andhrajyothy.com/2025/navya/emotional-reactions-and-the-danger-of-hasty-judgments-1407442.html

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!