
పెంపకం వల్ల, సమాజం వల్ల మనం కులం, జాతి, మతం వర్గం లాంటి అనేక కృత్రిమమైన విభజనలకు లోనవుతాం. ఈ విభజనలన్నిటినీ అధిగమించి అందరినీ సమానంగా చూడడమే సమత్వం వైపు తొలి అడుగు. ఇది బాహ్య ప్రవర్తన కన్నా చాలా లోతైన విషయం. సమత్వం లేదా సమానత్వం అనేది భగవద్గీతలో అనేక చోట్ల కనిపించే కీలకమైన అంశం. సమత్వ భావన, సమత్వ దృష్టి, సమత్వ బుద్ధి గురించి శ్రీకృష్ణుడు అనేక చోట్ల ప్రస్తావించాడు. బాధను, సంతోషాన్ని, లాభాన్ని నష్టాన్ని జ్ఞాని సమానంగా చూస్తాడంటూ అనేక ఉదాహరణలు కూడా ఇచ్చాడు.
సమత్వాన్ని అర్థం చేసుకోవడం సులభం. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కష్టం. ఒక మాటలో చెప్పాలంటే... మనలోని సమత్వం స్థాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం సాధించే పురోగతికి సూచిక. ‘పౌరులందరూ చట్టం ముందు సమానమే’ అంటూ సమత్వాన్ని ఆధునిక సమాజాలు అంగీకరించాయి. సమత్వం వైపు మన పురోగతిలో తదుపరి స్థాయి... దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సమత్వ దృష్టితో/ భావనతో చూడడం. ఇందుకు ఉదాహరణ... మన పిల్లలు అంతగా రాణించని సందర్భాలలో మన మిత్రుల పిల్లలు రాణిస్తూ ఉంటే చూసి సంతోషించగలగడం. అత్తను, తల్లిని సమానంగా చూడడం, కూతురును, కోడలును ఒకే విధంగా ఆదరించడం. ఇతరులను మనతో సమానంగా చూసే సామర్థ్యం... సమానత్వానికి పతాకస్థాయి. ఇతరులకు పదోన్నతి, కీర్తి, ప్రతిష్టలు, ఆస్తులు దక్కినప్పుడు... సమత్వభావనతో వ్యవహరించగలిగే సామర్థ్యం ఇది. ఇతరుల బలహీనతలను మనలో, మనలోని సామర్థ్యాలను ఇతరులలో చూడగలిగితేనే ఇది సాధ్యపడుతుంది.
అందుకే మనల్ని ఇతరులలో, ఇతరుల్ని మనలో చూడాలని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. చివరికి తనను (శ్రీకృష్ణుణ్ణి) అందరిలో, అన్నిటిలో చూడమని చెప్పాడు. ప్రతిదాన్ని విభజించి చూసేలా సామాజికంగా శిక్షణ పొందిన మనస్సు.... అత్యున్నతస్థాయి సమత్వాన్ని పొందడానికి పెద్ద అవరోధం. మన మీద మనస్సు అధిపత్యం చెలాయించేలా అనుమతించడానికి బదులు మనమే మనస్సును లొంగదీసుకోవాలి. అప్పుడే సమత్వ భావనను సాధించడం సాధ్యపడుతుంది.
https://www.andhrajyothy.com/2025/navya/the-power-of-equality-1399645.html