
భగవద్గీతలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంశాల్లో స్వధర్మం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ ప్రధానమైనది. ‘ఏది స్వధర్మం? దాన్ని ఎందుకు ఆచరించాలి? దాని నుంచి దూరం కావడం వల్ల ఏం జరుగుతుంది?’ లాంటి విషయాలను శ్రీకృష్ణుడు ఈ సందర్భంలో స్పష్టంగా తెలియజేశాడు. యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలోకి అడుగుపెట్టిన అర్జునుడి ఆలోచనలకు, మాటలకు, చర్యలకు మధ్య పొందన లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. వాటిని సమన్వయపరుచుకొనే మార్గాన్ని అర్జునుడికి చూపించే ప్రయత్నం చేశాడు. అర్జునుడు తన స్వధర్మం ప్రకారం యుద్ధం చేయడమే... సమన్వయం. యుద్దాన్ని నివారించాలనుకోవడం దానికి విరుద్ధం. ఇటువంటి అయాచితమైన యుద్ధం స్వర్గానికి ద్వారాలు తెరుస్తుందని, దాని నుంచి పారిపోవడం వల్ల స్వధర్మం, కీర్తి నశిస్తాయని, పాపం కలుగుతుందనీ శ్రీకృష్ణుడు చెప్పాడు. యుద్ధ క్షేత్రంలో అర్జునుడికి ఆయన ఇచ్చిన ఈ సలహాలు నిర్దిష్టమైన సందర్భాలకే పరిమితమని అర్థం చేసుకోవాలి. నిజానికి ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నది... స్వధర్మంతో సామరస్యం, సమన్వయం గురించే తప్పయుద్ధం గురించి కాదు.
సామరస్యం అంటే...
సృష్టిలోని చిన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల నుంచి పెద్ద పెద్ద నక్షత్ర మండలాలు, గ్రహాల వరకూ అన్నీ సామరస్యంతోనే ఉంటాయి. అందుకే సామరస్యతే ఈ సృష్టిని పరిపాలిస్తుంది. ఒక రేడియో స్టేషన్‌తో రేడియోకు సామరస్యత (ట్యూనింగ్) ఉన్నప్పుడు మనం అందులో వచ్చే సంగీతాన్ని ఆస్వాదించగలుగుతాం. సామరస్యానికి మానవ దేహాన్ని మించిన ఉదాహరణ లేదు. ఇందులో అనేక అవయవాలు, రసాయనాలు సమన్వయంతో పని చేసి మనకు జీవితాన్ని ఇస్తాయి. ఇక్కడ సామరస్యం అంటే యథాతథంగా ఉండే వస్తువులు, పరిస్థితులు, అంతే తప్ప మనం కోరుకొనే విధంగా అభిప్రాయాలు, ఆశించే విలువల ప్రకారం ఉండేవి కావు. మనం చేసిన మంచి పనులు మనం మరణించేక స్వర్గానికి, చెడ్డపనులు నరకానికి తీసుకువెళ్తాయని బాల్యం నుంచీ మనకు బోధిస్తూ ఉంటారు. స్వర్గం, నరకం అనేవి మరణం తరువాత చేరుకొనే ప్రదేశాలు కావనీ, ఒకరి సామర్థ్యాన్నిబట్టి, అవకాశాలు దొరకడాన్ని బట్టి అవి ఇక్కడే, ఇప్పుడే ఉంటాయని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. ఇతరుల స్వధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు... కుటుంబాలలో, పని చేసే ప్రదేశాలలో అనుబంధాల మధ్య సామరస్యత నెలకొంటుంది. అది స్వర్గంతో సమానం. అలా లేకపోతే నరకం. మన కోరికలు తీరడం లేక తీరకపోవడాన్ని బట్టి మనం సుఖాన్నో లేదా దుఃఖాన్నో అనుభూతి చెందుతాం. స్వధర్మంతో అంతర్గత సామరస్యత సాధించినట్టయితే... బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవితం స్వర్గతుల్యంగా ఉంటుంది.
-కె.శివప్రసాద్