Gita Acharan |Telugu

భగవద్గీతలో అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకాలలో ‘కర్మణ్యే వాధికార స్తే మా ఫలేషు కదాచన...’ అనేది ఒకటి. ‘మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ, కర్మ ఫలం మీద అధికారం లేదు’ అని చెబుతున్న ఈ శ్లోకాన్ని భగవద్గీత సారాశం అని చెప్పవచ్చు. మనకు ప్రియమైనవారికి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు... నిజాయితీ కలిగిన, సమర్థుడైన సర్జన్‌ కోసం చూస్తాం. ఎందుకంటే అతని యోగ్యత... శస్త్రచికిత్స విజయాన్ని సూచిస్తుంది. అతని నిజాయితీ... అనవసరమైన శస్త్రచికిత్స చేయరనే భరోసా ఇస్తుంది. అంటే సంక్షిప్తంగా మనం కర్మయోగి అయిన సర్జన్‌ కోసం వెతుకుతున్నామని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మనం కోరుకొనే రెండు ప్రత్యేకతలు ఈ శ్లోకాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయపడతాయి.

కర్మ ఫలం గురించి చింతించకుండా కర్మలో లోతుగా నిమగ్నమైనప్పుడు... మనం కాలాతీతమైన (కాలాన్ని అధిగమించిన) స్థితికి చేరుకుంటాం. అంటే ఇక్కడ సమయంతో సంబంధం లేదు. పైన చెప్పిన శస్త్రచికిత్స ఉదాహరణనే తీసుకుందాం. మనం ఆపరేషన్‌ థియేటర్‌ వెలుపల ఉన్నప్పుడు... సమయం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. మరోవైపు కర్మయోగి అయిన సర్జన్‌... శస్త్రచికిత్సలో నిమగ్నమై, సమయానికి సంబంధించిన స్పృహను కోల్పోతారు. ఇంకో విధంగా చూస్తే... అతని దృష్టిలో సమయం ఆగిపోయి ఉంటుంది.

మనకు సేవ చేసేవారందరూ కర్మయోగులుగా ఉండాలని, సర్వోత్తమ ఫలితాలు అందించాలని మనం ఆశిస్తూ ఉంటాం. అదే సూత్రాన్ని మనకు అన్వయించుకుంటే... మనం కూడా మన దైనందిన జీవితంలో ఇతరులకు సేవ చేస్తూ కర్మయోగులుగా ఉండాలి. పని చేసే చోట, కుటుంబ వ్యవహారాల్లో ఏ బాధ్యత నిర్వర్తించినా సర్వోత్తమమైన కృషి చేయాలి. కర్మయోగ సాధనలో వేసే చిన్నచిన్న అడుగులు... మనల్ని సమత్వానికి దగ్గరగా తీసుకువస్తాయని, అవి మనలో ఆనందాన్ని కలిగిస్తాయని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మనం మళ్ళీ కలుసుకొనే అవకాశం లేనివారికి అత్యుత్తమ సేవలను అందించగలిగినప్పుడు... మనం కర్మయోగిగా మారే మార్గంలో దృఢంగా ఉన్నామని అర్థం.

 

కె.శివప్రసాద్‌

 

https://www.andhrajyothy.com/2025/navya/the-power-of-karma-yoga-1391625.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!