Gita Acharan |Telugu

చరిత్రలో ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంభాషించిన సందర్భాలు చాలా తక్కువ. జనక మహారాజు, అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన అలాంటి సంభాషణను ‘అష్టావక్ర గీత’ అని పిలుస్తారు. ఇది ‘సాధకులకు ఉపయోగపడే అత్యుత్తమమైన సంభాషణ’ అని పెద్దలు పేర్కొన్నారు. ఒకసారి ఒక గురువు తన శిష్యుణ్ణి చివరి పాఠం కోసం జనక మహారాజు దగ్గరకు పంపాడు. అతను కట్టుకున్న గోచీ, భిక్షాపాత్రతో జనకుడి వద్దకు వచ్చాడు. ‘విలాసాల మధ్య ఉన్న రాజు దగ్గరకు తనను ఎందుకు పంపించాడా?’ అని ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు.

 

ఒక రోజు ఉదయం జనకుడు అతణ్ణి స్నానానికి దగ్గరలోని నది దగ్గరకు తీసుకువెళ్ళాడు. స్నానం చేస్తూ ఉండగా... రాజభవనం కాలిపోయిందనే వార్త వచ్చింది. శిష్యుడు తన గోచీ గురించి ఆందోళన చెందుతున్నాడు. కానీ జనకుడు రాజ భవనం గురించి ఏమాత్రం కలవరపడలేదు. సాధారణమైన గోచీతో కూడా అనుబంధం అనేది అనుబంధమేననీ, దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉన్నదనీ ఆ క్షణంలో శిష్యుడు గ్రహించాడు.


 

అనాసక్తంగా... కర్తవ్య కర్మలను ఆచరించే మనిషి అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు. అనాసక్తుడిగా... ఆసక్తి, విరక్తి... ఈ రెండిటినీ వదిలేసిన వాడు... కర్మద్వారా మాత్రమే పరిపూర్ణత పొందినవాడు అయిన జనక మహారాజు ఉదాహరణను ఇచ్చాడు. విలాసాలలో నివసించేవాడు, అనేక బాధ్యతలను కలిగి ఉన్నవాడు అయిన మహారాజు కూడా... అనాసక్తుడై చర్యలను చేయడం ద్వారా సర్వోన్నతమైన స్థితిని పొందగలడనే విషయాన్ని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం కూడా అదే విధంగా ఉన్నత స్థితికి చేరుకోగలమని ఇది సూచిస్తుంది.

 

అనాసక్తితో కర్మలు చేయడం అనేది భగవద్గీతలోని ప్రధాన బోధన. ఇది ఆసక్తి, విరక్తుల ప్రత్యేక సంగమం. ఒక వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించి, తన వంతు సర్వోత్కృష్టమైన కృషి చేయాలి. బాధ్యతలను నిర్వహించడానికి చేసే పని తాలూకు ఫలితం ప్రయత్నాలను బట్టి ఉండవచ్చు లేదా దానికి పూర్తి విరుద్ధంగా ఉండవచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా అనాసక్తుడైవ వ్యక్తి ఆందోళన చెందడు, కలవరపడడు. అదే సమయంలో అతని చర్యల ఫలితం అతణ్ణి ప్రభావితం చేయడం లేదు కాబట్టి, అంతర్గతమైన కలవరం ఉండదు. ఆధునిక యుగంలో వృత్తి-జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది కీలకమైన మార్గం.

 

-కె. శివప్రసాద్‌

https://www.andhrajyothy.com/2025/navya/essence-of-detachment-wisdom-of-janaka-maharaja-and-ashtavakra-maharshi-1383637.html

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!