
కర్మ యోగాన్ని ఏ మోతాదులో సాధన చేసినా కూడా ఫలితాలను ఇస్తుందనీ, ఈ ధర్మం (క్రమశిక్షణ) మహా భయాల నుంచి మనల్ని రక్షిస్తుందని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చాడు. తమ ఆధ్యాత్మిక యాత్రను ఇప్పుడే ప్రారంభించినవారికి, ఆ ప్రయత్నాన్ని కఠినంగా భావించే సాధకులకు శ్రీకృష్ణుడు ఇచ్చిన కచ్చితమైన హామీ ఇది. మన కష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణుడు... ఒక చిన్న ప్రయత్నమైనా అద్భుత ఫలితాలను ఇస్తుందని హామీ ఇచ్చాడు. నిష్కామకర్మ (ప్రేరణలేని చర్య) ద్వారా సమానత్వ మార్గాన్ని అనుసరించాల్సిందిగా ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు. సాంఖ్య యోగం అనేది స్వచ్ఛమైన అవగాహన కాగా, కర్మ యోగంలో ప్రయత్నం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలి.
వాటిలో ఒక మార్గం... శ్రీకృష్ణుడు చెప్పిన దాని మీద శ్రద్ధ కలిగి ఉండడం. కర్మయోగం గురించి ఆయన చేసిన బోధను ఆచరించడం. మన అనుభవాలను కర్మయోగం అనే దృష్టితో చూడడాన్ని అభ్యసించినప్పుడు... మన అనుభూతులు మరింత లోతుకు వెళుతూ ఉంటాయి. చివరకు అంతరంగాన్ని చేరుకుంటాయి. దీనికి ప్రత్యామ్నాయమైన మార్గం ఏమిటంటే... కర్మ యోగ సాధన ఆ భయాలను ఎలా తొలగించగలదో తెలుసుకోవడం. మన అంతర్గత అంచనాలకు, వాస్తవ ప్రపంచానికి మధ్య పొంతన కుదరకపోవడమే భయానికి మూలం. కర్మయోగం మనకు నిష్కామ కర్మ గురించి బోధిస్తుంది. ఇది మనం చేసే పనుల విషయంలో ఆశలు లేకుండా ఉండేలా సహాయపడుతుంది. తద్వారా మనలోని భయాన్ని తగ్గిస్తుంది.
నీటి స్వభావం కారణంగా... చుక్కనికి జత చేసిన ఒక చిన్న బద్ద (ట్రిమ్ ట్యాబ్) మీద కాస్త అంతర్గత శక్తిని ఉపయోగించినా... ఓడ తన గమనాన్ని మార్చుకోవడానికి అది సహాయపడుతుంది. అదే విధంగా విశ్వానికి ఉన్న స్వభావం కారణంగా... మన లోపల నుంచి సరైన దిశలో చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇది మనకు కర్మయోగ మార్గం సుగమం కావడానికి సహాయం చేస్తుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం నడక, పరుగెత్తడం నేర్చుకొనే వరకూ ఆ ప్రయత్నాన్ని ఎన్నటికీ వదులుకోం. అది అంత తేలికైన పనేమీ కాదు. అదే విధంగా కర్మయోగంలో ప్రావీణ్యం సంపాదించడానికి పదేపదే చేసే ప్రయత్నాలు చిన్నవైనా... ఖచ్చితమైన విజయవంతమైన ఫలితాలను ప్రసాదిస్తాయి.