
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఎప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు. తద్వారా కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు తదితరాలను నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యంతో వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉండడమే పిల్లల్ని పెంచడానికి ఉత్తమ మార్గం. ఆ తరువాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సలహాదారుల్లాంటి వారి మీద వారు ఆధారపడడం కొనసాగుతుంది. అలాగే... మనమీద ఆధారపడే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం మనవైపు చూసే వ్యక్తులు ఉంటారని కూడా ఇది సూచిస్తోంది. మనం ఏది చేసినా అది వారి మీద ప్రభావం చూపుతుంది. దీని గురించి శ్రీకృష్ణుడు చెబుతూ ‘‘శ్రేష్టమైన పురుషుడి ఆచరణనే (ప్రవర్తననే) ఇతరులు అనుసరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకులందరూ పాటిస్తారు’’ అన్నాడు. అలాగే ‘‘ఓ అర్జునా! ముల్లోకాలలో నాకు కర్తవ్యం అనేదే లేదు. అలాగే నేను పొందాల్సిన వస్తువుల్లో పొందనిది కూడా లేదు. అయినా నేను కర్మలలోనే ప్రవర్తిల్లుతున్నాను. ఎప్పుడైనా నేను కర్మలను విస్మరిస్తే లోకానికి గొప్ప హాని సంభవిస్తుంది. ఎందుకంటే మనుషులందరూ అన్ని విధాలుగా నన్నే అనుసరిస్తారు. నేను కర్మలను ఆచరించడం మానేస్తే లోకాల్లో అల్లకల్లోలాలు చెలరేగుతాయి. లోకాలన్నీ నశిస్తాయి. అంతేకాదు, ప్రజానష్టం వాటిల్లుతుంది. అప్పుడు వాటన్నిటికీ నేనే కారణమవుతాను’’ అని చెప్పాడు.
ఈ విషయాలన్నీ పరమాత్మ స్థాయి నుంచి మనకు శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. సృష్టి, నిర్వహణ, విధ్వంసంతో కూడిన సృజనాత్మకత స్థాయి నుంచి బోధిస్తున్నాడు. ఒక రైతు విత్తనాలను నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కారణం సృజనాత్మకత. సృజనాత్మకత ఆగిపోతే... విత్తనాలు వృధా అవుతాయి. మొలకెత్తిన తరువాత పంట ఎదగకపోతే... అది కూడా గందరగోళానికి దారి తీస్తుంది. పెరిగిన తరువాత పంట పండకపోతే... అది ముందు తరాలను నాశనం చేస్తుంది. ఇవన్నీ సృజనాత్మకత తన చర్యను ఆపివేస్తే ఎదురయ్యే పరిణామాలు. ఈ ఉదాహరణ ద్వారా... శ్రీకృష్ణుడు చెప్పినదాన్ని మనం అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ విశ్వంలో కనిపించే, కనిపించని స్వయంచాలకత్వం మీద మన జీవితాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. సృజనాత్మకత ద్వారా అలసిపోకుండా జరుగుతున్న అనేక కార్యాల కారణంగానే మన మనుగడ సాధ్యమవుతోంది.
https://www.andhrajyothy.com/2024/navya/guidance-with-practice-1323153.html