Gita Acharan |Telugu

 

‘‘నీవు శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. ఎందుకంటే కర్మలను చెయ్యకుండా ఉండడం కన్నా చెయ్యడం ఉత్తమం. కర్మలను ఆచరించకపోతే... నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు’’ అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ఆహారాన్ని సేకరించడం, భోజనం చేయడం లాంటి చర్యలు మానవ శరీరం మనుగడకు అవసరం. మానవ శరీరం అనేక అవయవాలను, వ్యవస్థలను, రసాయనాలను కలిగి ఉంటుంది. ఇవి క్రమం తప్పకుండా వేలాది అంతర్గత చర్యలను సాగిస్తూ ఉంటాయి. వాటిలో ఒక్కటి క్రమం తప్పినా... శరీరం తన అంతర్గత సామరస్యాన్ని కోల్పోతుంది, రోగగ్రస్తం అవుతుంది, లేదా నశిస్తుంది. అంటే శరీర నిర్వహణ... నిష్ర్కియాత్మకంగా సాధ్యం కాదు.

 

శ్రీకృష్ణుడు నియత కార్యాలు లేదా నియత చర్యల గురించి మాట్లాడాడు. అది ఒక క్లిష్టమైన తత్త్వజ్ఞానం. సమాజం మనమీద విధించిన కట్టుబాట్లు, పవిత్ర గ్రంథాలు ప్రశంసించిన ఆచారాలు లేదా విధులు సాధారణంగా నియత కార్యాలుగా పరిగణన పొందుతాయి. కానీ శ్రీకృష్ణుడు ఏది చెబుతున్నాడో దాన్ని ప్రతిఫలించడంలో ఈ రెండూ విఫలమవుతాయి. చిన్న విత్తనం విశాలమైన చెట్టుగా మారినట్టు, చిన్న కణం జన్యువులలో (జీన్స్‌ లో) ఉన్న సూచనలను అమలు చేయడం ద్వారా సంక్లిష్టమైన మానవ శరీరంగా అభివృద్ధి చెందినట్టు ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత సామర్థ్యాన్ని సాధించడమే మన బాధ్యత. కణాల కోసం జన్యువులలోని సూచనల మాదిరిగా... ప్రతి ఒక్కరి కర్మ వారి గుణాల ద్వారా ఎంపిక అవుతుందని అర్థం చేసుకోవాలి.

 

 

ఇది మన పూర్తి సామర్థ్యాలతో సర్వోత్తమమైన కృషిని చేయడం. ఇదంతా ‘మనం ఏం చేస్తున్నాం?’ అనే దాని గురించి కాదు. ‘ఏ పనినైనా ఎంత బాగా చేస్తున్నాం?’ అనే దాని గురించి. మన భౌతిక శక్తి, అనుభవం, సమయం తదితరాల మీద ఆధారపడి మనలోని ప్రతి ఒక్కరికీ సర్వశ్రేష్టం అనే నిర్వచనం వేర్వేరుగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది కొన్నిసార్లు కేవలం ఉనికి, నిశ్శబ్దం లేదా సానుభూతితో వినడం కూడా కావచ్చు. ఇది మనల్ని ఆ శాశ్వతమైన స్థితి అయిన మోక్షానికి (గుణాలను అధిగమించడం) తీసుకువెళ్తుంది. ఇదే మన నియత కార్యం. దాన్ని మనం చెయ్యాల్సిందే తప్ప ఎంచుకోలేం. ఎందుకంటే మన జీవితంలో అతి పెద్ద సంఘటన అయిన పుట్టుకే మనం చేసుకున్న ఎంపిక కాదు.

 

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

 

https://www.andhrajyothy.com/2024/navya/bhagavad-gita-one-should-perform-unscientific-duties-because-doing-karmas-is-better-than-not-doing-them-1315172.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!