
‘‘ఇంద్రియాల ద్వారా విషయాలను స్వీకరించని వ్యక్తి నుంచి ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి. కానీ ‘రస్’ (కాంక్ష/రాగం) దూరం కాదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమైపోతుంది’’ అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ఇంద్రియాలకు మెదడులో నియంత్రకాలు ఉంటాయి. మనస్సు అనేది ఇంద్రియ నియంత్రకాల కలయిక. ఈ నియంత్రకాలపై దృష్టి సారించాలని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ‘రస్’ అనే పదాన్ని ఉపయోగించాడు. పండిన పండ్లను కోసి, పిండినప్పుడు తప్ప రసం కనిపించదు. పాలలో ఉండే వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే ఇక్కడ ‘రస్’ అంటే ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గతమైన కోరిక. అజ్ఞాన స్థాయిలో... ఇంద్రియాలతో ఇంద్రియ వస్తువులు జతపడి ఉంటాయి. సుఖ దుఃఖాల ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి. తదుపరి దశలో... కోరికలను తీర్చుకొనే మార్గం లేక... ఆ కోరికలను మనం వదిలేస్తాం. ఉదాహరణకు... డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా లాంటి బాహ్య పరిస్థితుల కారణంగా... మిఠాయి లాంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాం. కానీ మిఠాయి పట్ల కోరిక మిగిలిపోతుంది. నైతికత, దేవుడు లేదా చట్టం పట్ల భయం, ప్రతిష్ట పోతుందనే అనుమానం, వృద్ధాప్యం లాంటి బాహ్య పరిస్థితుల కారణంగా కోరికలను వదిలేస్తాం. కానీ ఏ కారణం లేకుండానే విషయవాంఛలను అంటే అన్ని కోరికలను వదిలేసే పరమ దశ గురించి శ్రీకృష్ణుడు పై శ్లోకంలో సూచిస్తున్నాడు.
దీని కోసం ఒక ఆచరణాత్మకమైన చిట్కాను శ్రీకృష్ణుడు చెప్పాడు. అక్కడ ఆయన ఇంద్రియాలను ఆడని గుర్రాలతో పోల్చాడు. శిక్షకుడు కొంతకాలం వాటితోపాటు పరుగెత్తి... వాటిని నియంత్రణలోకి తీసుకువస్తాడు. వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నాక... తన ఇష్టానుసారం వాటి మీద స్వారీ ప్రారంభిస్తాడు. ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు ఏమిటంటే... శిక్షకుడు గుర్రాలను ఒక్కసారిగా నియంత్రించలేదు. అలా చేస్తే అవి అతణ్ణి కింద పడేస్తాయి. అదే విధంగా, మన ఇంద్రియాలను ఒక్కసారిగా నియంత్రించడం ప్రారంభించలేం. వాటిని అర్థం చేసుకొని, నెమ్మదిగా అదుపులోకి తేవాలి.
అంతవరకూ కొంతకాలం పాటు వాటి వ్యవహారాలకు అనుగుణంగా నడుచుకోవాలి. రెండోది, మనం ఇంద్రియాల ప్రభావంలో ఉన్నప్పుడు... వాటిని ప్రస్తుతం నియంత్రించలేకపోయినా.... భవిష్యత్తులో నియంత్రించాలనే నిరంతర అవగాహన మనకు ఉండాలి. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్టు... అవగాహన, కోరిక... ఈ రెండిటిలో ఒకటి మాత్రమే మనలో ఉండగలదు. అవగాహన ఉన్నప్పుడు మనల్ని కోరికలు వాటి అధీనంలోకి తీసుకోలేవు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నప్పుడే వాటి అధీనంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది.