Gita Acharan |Telugu

 

‘‘తా బేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్టు... ఇంద్రియాలను విషయాసక్తుల నుంచి అన్ని విధాలా ఉపసంహరించుకున్న వ్యక్తి బుద్ధి స్థిరంగా ఉన్నట్టు భావించాలి’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు చాలా ప్రాధాన్యం ఇస్తాడు. ఎందుకంటే అవి మన అంతర్గత ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్య ద్వారాలలాంటివి. తాబేలును ఉదాహరణగా తీసుకుంటే... అది ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. అదే విధంగా ఇంద్రియాలను ప్రేరేపించే, ప్రలోభపెట్టే విషయాలతో ఇంద్రియాలు జతకూడడం గమనించినప్పడు... మన ఇంద్రియాలను లోపలికి ఉపసంహరించుకోవాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నాడు.

 

ప్రతి ఇంద్రియానికి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బయటికి కనిపించే కన్ను లాంటి బాహ్యమైన భాగం.. రెండవది కన్నును నియంత్రించే మెదడులోని ఇంద్రియ నియంత్రిత భాగం. ఇంద్రియాలు, ఇంద్రియార్థాల మధ్య పరస్పర స్పందనలు రెండు స్థాయిలలో జరుగుతాయి. మొదటిది... కాంతి తాలూకు కణాలు (ఫోటాన్లు) బాహ్య ఇంద్రియ పరికరమైన కన్నును చేరినప్పుడు.. కన్ను దానంతట అదే కాంతికి స్పందిస్తుంది. అదే విధంగా మిగిలిన ఇంద్రియ పరికరాలు కూడా తమతమ ఇంద్రియ విషయాలకు వాటంతట అవే స్పందిస్తాయి. ఇక రెండవ స్థాయి అనేది... ఇంద్రియాలకు, వాటిని నియంత్రించే మెదడులోని భాగాలకు మధ్య జరుగుతుంది.

 

చూడాలనే కోరికే కంటి వికాసానికి కారణం. ఆ కోరిక ఇంద్రియాన్ని నియంత్రిచే భాగంలో ఉంది. సాంకేతికపరంగా దాన్ని ‘ప్రేరేపిత దృష్టి’ (మోటివేటెడ్‌ పర్సెప్షన్‌) అని పిలుస్తారు. ఇక్కడ మనం చూడాలనుకున్నవాటినే చూస్తాం. వినాలనుకున్నవాటినే వింటాం. కానీ సమగ్రంగా చూడలేం, సంపూర్ణంగా వినలేం. కృష్ణుడు ఇంద్రియాల గురించి ప్రస్తావించినప్పుడు... కోరికలను ఉత్పత్తి చేసే ఇంద్రియ నియంత్రక భాగం గురించి వివరిస్తున్నాడు. మనం ఇంద్రియాలను భౌతికంగా మూసేసినా... మన కోరికలను సజీవంగా ఉంచడం కోసం మనస్సు తన ఊహాశక్తిని ఉపయోగిస్తుంది. ఎందుకంటే మనస్సు ఈ నియంత్రణలన్నిటి కలయిక కాబట్టి. ఇంద్రియాలను నియంత్రించేవాటిని. ఇంద్రియాల భౌతిక భాగం నుంచి వేరు చేయాలని శ్రీకృష్ణుడు మనకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. తద్వారా మనం ఎల్లప్పుడూ ఉత్తేజపరిచే లేదా నిరుత్సాహపరిచే బాహ్య పరిస్థితుల నుంచి స్వేచ్ఛను (మోక్షాన్ని) పొందుతాం. ఏ పరిస్థితుల్లో ఎప్పుడు వెనకడుగు వెయ్యాలో, అంటే ఇంద్రియాలను ఎప్పుడు ఉపసంహరించుకోవాలో తెలుసుకోవడమే వివేకం.

https://www.andhrajyothy.com/2024/navya/it-is-wise-to-withdraw-1309190.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!