Gita Acharan |Telugu

 

‘‘ఓ అర్జునా! ఇంద్రియాలను లొంగదీసుకోవడం కష్టం. మనిషి వాటిని నిగ్రహించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా... ఆసక్తి తొలగిపోనంతవరకూ అవి అతని మనసును ఇంద్రియార్థాలవైపు బలవంతంగా లాక్కుపోతూనే ఉంటాయి’’ అని అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. ఈ శ్లోకం బాహ్య ఇంద్రియ విషయాలకు ఇంద్రియాల స్వయంచాలకత గురించి (వాటంతట అవే ప్రవర్తించే తీరు గురించి) వివరిస్తుంది. ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి బాగా తెలిసి కూడా... దాన్ని మానుకోలేక... కొనసాగించేవారు దీనికి ఉత్తమ ఉదాహరణ. సిగరెట్‌ మానుకుందామనుకున్నప్పటికీ... తమకు తెలియకుండానే వెలిగించేశామని చాలామంది బాధపడుతూ ఉంటారు. రోడ్ల మీద ఇతరులతో చిన్న విషయాలకు కొట్లాడేవాళ్ళు లేదా నేరాల్లో పాల్గొన్నవారు తాము ఆ పనులను క్షణికావేశంతో చేశాం తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని ప్రమాణపూర్తిగా చెబుతారు. కార్యాలయంలో లేదా కుటుంబంతో కఠినమైన పదాలతో మాట్లాడే వ్యక్తులను విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ మాటలు అనాలని ముందుగా నిర్ణయించుకొని అన్నవి కావు కాబట్టి ఆ తరువాత పశ్చాత్తాపం చెందుతారు. ఇంద్రియాలు మనల్ని స్వాధీనం చేసుకుంటాయనీ, కర్మ బంధంలో మనల్ని బంధిస్తాయని ఈ ఉదాహరణలు సూచిస్తున్నాయి.

మెదడులోని కణాలు (న్యూరాన్లు) నడక లాంటి స్వయంచాలక కార్యకలాపాలను చూసుకోవడానికి ‘హార్డ్‌ వైరింగ్‌’ అని పిలిచే కూటములను మన చిన్న వయసులోనే ఏర్పాటు చేస్తాయి. ఇది మెదడు శక్తిని ఎంతగానో ఆదాచేస్తుంది. రోజువారీ జీవితంలో మనం సంపాదించిన నైపుణ్యాలు, అలవాట్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇలా నిర్మితమైన ‘హార్డ్‌ వైరింగ్‌’ ఎంత శక్తిమంతంగా మారుతుందంటే... దానివల్ల వచ్చిన అలవాట్లను అధిగమించడం చాలా కష్టం. కొత్తదాన్ని తయారు చెయ్యడం తప్ప... ఉన్న హార్డ్‌ వైరింగ్‌ను విచ్ఛిన్నం చెయ్యడం అసాధ్యమని న్యూరో సైన్స్‌ చెబుతోంది.

‘‘ఇంద్రియాలు చాలా శక్తిమంతమైనవి. తెలివైన వ్యక్తి మనస్సును కూడా అవి బలవంతంగా హరించగలవు’’ శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. ఇంద్రియాల స్వయంచలనాన్ని అధిగమించడానికి... సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎదుట ఆత్మసమర్పణ చేసుకోవాలని ఆయన బోధించాడు. ఇంద్రియాల గురించి అవగాహన పొందడం వల్లనే... వాటిని నియంత్రించడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. ఆ అవగాహన లేనప్పుడు.. ఇంద్రియాలతో పోరాడి వాటిని అదుపు చెయ్యలేం.

 

https://www.andhrajyothy.com/2024/navya/indriya-nigraha-krishnas-warning-arjunas-struggle-automaticity-of-the-senses-it-is-difficult-to-subdue-the-senses-1303191.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!