Gita Acharan |Telugu

విష, అమృత వలయాలు అంటే ఒకదాని నుంచి మరొక దానికి దారితీసే సంఘటనల సమూహాలు. ఇవి సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే... అది ఋణాల ఊబిలోకి దారి తీసే ఒక విషవలయం. ఆదాయం కన్నా ఖర్చులు తక్కువగా ఉండి... సంపద సృష్టి జరిగితే... అది అమృత వలయం. ఈ వలయాల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తూ ‘‘విషయ చింతన చేసే వ్యక్తికి ఆ విషయాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి కారణంగా... ఆ విషయాలను పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీరనప్పుడు... క్రోధం ఏర్పడుతుంది. అలాంటి క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది.

 

దాని ప్రభావం వల్ల స్మృతి ఛిన్నాభిన్నం అవుతుంది. స్మృతిని కోల్పోవడం వల్ల బుద్ధి... అంటే జ్ఞాపకశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనమైపోవడం వల్ల మనిషి తను ఉన్న స్థితి నుంచి పతనం అయిపోతాడు’’ అని చెప్పాడు. ఇది పతనానికి సంబంధించిన విషవలయం. అలాగే ‘‘అంతఃకరణను వశంలో ఉంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నప్పటికీ, వాటి ఆకర్షణకు లోనుకాకుండా... మనశ్శాంతిని పొందుతాడు’’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఇది శాంతి, ఆనందాల అమృత వలయం.

 

మనమందరం దైనందిన జీవితంలో ఆకర్షణీయమైన లేక అసహ్యమైన ఇంద్రియ వస్తువుల మధ్య సంచరిస్తూ ఉంటాం. వాటితో మనం ఎలా వ్యవహరిస్తామనేది మన ప్రయాణం దిశను నిర్దేశిస్తుంది. అమృతవలయంలోకి ప్రయాణిస్తున్నవారు... ఇంద్రియ వస్తువుల ఆకర్షణ, వికర్షణల నుంచి విముక్తి పొందుతారు. ఇక విషయవలయం వైపు వెళ్తున్నవారు ఇంద్రియ వస్తువుల ఆకర్షణకు లోనవుతారు లేదా అసహ్యాన్ని పెంచుకుంటారు. విషవలయం నుంచి అమృతవలయానికి రావడానికి సులువైన మార్గం... ద్వేషాన్ని వదిలెయ్యడం. ఎందుకంటే ద్వేషం ప్రాణాంతకమైన విషం లాంటిది.

 

ద్వేషాన్ని వదిలేసినప్పుడు... దానికి వ్యతిరేక ధ్రువమైన రాగం కూడా తొలగిపోతుంది. షరతులు లేని ప్రేమకు అది దారి తీస్తుంది. రాగద్వేషాలను దాటి ముందుకు పోవడం అనేది భగవద్గీతలోని ఒక మౌలిక ఉపదేశం. అన్ని జీవులలో మనల్ని, అన్ని జీవులను మనలో... చివరకు అన్నిటిలో, ప్రతి చోటా తనను (శ్రీకృష్ణుణ్ణి) చూడాలని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. ద్వేషాన్ని వదిలెయ్యడానికి ఈ ఏకత్వం మనకు సహాయపడుతుంది. అంతిమంగా... మనకు ఆనందం కలిగిస్తుంది.

 

https://www.andhrajyothy.com/2024/navya/navya-vicious-circles-are-groups-of-events-that-lead-from-one-to-another-1280901.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!