Gita Acharan |Telugu

కర్ణుడు, అర్జునుడు... ఇద్దరూ కుంతికి జన్మించారు. కానీ వ్యతిరేక పక్షాల్లో నిలిచి పోరాడారు. కర్ణుడు శాపగ్రస్తుడు. ఆ కారణంగా... అర్జునుడితో సాగించిన కీలకమైన పోరాటంలో... కర్ణుడి జ్ఞానం, యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. యుద్ధంలో ఓడిపోయాడు, హతుడయ్యాడు. ఈ పరిస్థితి మనకందరికీ వర్తిస్తుంది. మనమూ తరచుగా కర్ణుడిలాగానే ఉంటాం. జీవితంలో మనం చాలా నేర్చుకుంటాం. జ్ఞానాన్నీ, అనుభవాన్నీ పొందుతాం. కానీ కీలకమైన సమయాల్లో మనం అవగాహనకు బదులు మన ప్రవృత్తులను బట్టి ఆలోచిస్తాం. పని చేస్తాం. ఎందుకంటే మన అవగాహన అవసరమైన స్థాయికన్నా తక్కువగా ఉంటుంది.

 

శ్రీకృష్ణుడికి దీని గురించి పూర్తిగా తెలుసు. కాబట్టే వివిధ కోణాల నుంచి వాస్తవికతను, సత్యాన్నీ ‘భగవద్గీత’లో పదేపదే వివరించాడు. తద్వారా లోతైన అవగాహనలో అవసరమైన స్థాయికి చేరుకోవాలన్నాడు. ఒక నదికి ఉండే రెండు తీరాల్లా... మనలో అంతరాత్మ, భౌతిక శరీరం అనే రెండు భాగాలున్నాయని ‘భగవద్గీత’ చెబుతుంది. సాధారణంగా మనం మన భౌతిక శరీరం, మన భావోద్వేగాలు, ఆలోచనలు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడిన భాహ్య భాగం ద్వారా గుర్తింపు పొందుతూ ఉంటాం. అలాకాకుండా అన్ని జీవుల్లో ఉన్నది, శాశ్వతమైనది, మార్పు లేనిది అయిన మన అంతరాత్మను గుర్తించమన్నాడు శ్రీకృష్ణుడు. ఆత్మజ్ఞాని అంతరాత్మ అనే ఒక ఒడ్డు చేరుకొని... ఇక్కడ ఉన్నది కేవలం ఒక్క ఒడ్డు మాత్రమేననీ, అవతలి ఒడ్డు అనేది తాడును పాముగా భ్రమించడం.... అంటే ‘రజ్జు సర్పభ్రాంతి’ అనీ తెలుసుకుంటాడు.

 

ద్వంద్వాలను అధిగమించడం (ద్వంద్వాతీత), గుణాలను అధిగమించడం (గుణాతీత), సమానత్వం, ‘మనం కర్తలం కాదు, సాక్షులం’ అని గ్రహించడం, కర్మ నుంచి కర్మ ఫలాలు స్వతంత్రమైనవనే అవగాహన అనేవి చైతన్య సాధన మార్గాలు. వంద పుస్తకాలు చదవడం కన్నా భగవద్గీతను (ముఖ్యంగా రెండవ అధ్యాయాన్ని) చాలాసార్లు చదవడం మంచిది. ఎందుకంటే ప్రతిసారీ గీతాపఠనం మనలో విభిన్నమైన రుచిని, భావనను, మెరుగైన సాక్షాత్కారాన్నీ కలిగిస్తుంది. ఆనందాన్ని ప్రవహింపజేస్తుంది.

 

కె. శివప్రసాద్‌

https://www.andhrajyothy.com/2024/navya/navya-ways-of-practicing-consciousness-1264779.html

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!